Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన కేంద్రం

New Delhi: పెరుగుతున్న కరోనా కేసుల మధ్య కేంద్ర‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్-19 కేసుల పెరుగుద‌లపట్ల‌ జాగ్రత్తగా ఉండాలని కోరింది. జ్వరం, దగ్గు 5 రోజుల కంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలని అందులో పేర్కొంది. 
 

Corona virus cases are on the rise. Centre issues new guidelines  RMA
Author
First Published Mar 20, 2023, 3:12 AM IST

Coronavirus-Centre issues new guidelines: భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు నెమ్మ‌దిగా పెరుగుతున్నాయ‌ని అధికారిక గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఇదే స‌మ‌యంలో ఫ్లూ కేసులు సైతం రికార్డు స్థాయిలో న‌మోదుకావ‌డంపై అధికార యంత్రాంగం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్య‌క్తంచేసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వయోజనుల చికిత్సకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. భౌతిక దూరం, ఇండోర్ లోనూ మాస్కులు వాడకం, చేతుల పరిశుభ్రత వంటివి ప్రజలు పాటించాల‌నీ, కొన్ని పరిస్థితులలో యాంటీబయాటిక్స్ నివారించడం కీల‌క‌మ‌ని పేర్కొంది.

కరోనాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం, దగ్గు 5 రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై జనవరి నెలలో చర్చించారు. తీవ్రమైన లక్షణాలు లేదా అధిక జ్వరం ఉంటే, రెమ్డెసివిర్ (మొదటి రోజు 200 మి.గ్రా ఐవి, తరువాత 4 రోజులకు 100 మి.గ్రా ఐవి ఓడి) ఇవ్వడాన్ని పరిగణించవచ్చు. వైర‌స్, బ్యాక్టీరియా సంక్రమణపై క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ వాడకూడదు. కొవిడ్-19 ఇతర అంటువ్యాధులతో కలిసి సంక్రమించే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల‌ని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైగ్రేడ్ జ్వరం/ తీవ్రమైన దగ్గు, ముఖ్యంగా 5 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 

ఆయా రాష్ట్రాలకు లేఖలు..

టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం లేఖ రాసింది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

దేశంలో కరోనా పరిస్థితి..

గత కొన్ని నెలలుగా దేశంలో కోవిడ్ -19 కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే, గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత్ లో 129 రోజుల తర్వాత ఒక్క రోజులో వెయ్యికి పైగా కోవిడ్-19 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,915కు పెరిగింది. ఆదివారం (మార్చి 19) ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 24 గంటల్లో దేశంలో మొత్తం 1,071 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, మరో ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 5,30,802 కు పెరిగింది. దేశంలో కరోనా కారణంగా కేరళ, రాజస్థాన్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios