భారత్‌లో కరోనా మరణాలు ఎక్కువగా చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చూపించడానికి వెనుక ప్రపంచ దిగ్గజ ఫార్మా సంస్థల కుట్రను కాదనలేమని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్ యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి కేంద్ర ప్రభుత్వం అనుమతించని ఫార్మా సంస్థలు డబ్ల్యూహెచ్‌వోను ప్రభావితం చేసి తప్పుడు లెక్కింపు విధానాన్ని ఎంచుకోవడానికి ఒత్తిడి తెచ్చి ఉండొచ్చని వివరించాయి. ప్రభుత్వానికి అపకీర్తి అంటగట్టడానికే ఈ నివేదిక విడుదల చేసినట్టు ఆరోపించాయి.

న్యూఢిల్లీ: భారత్‌లో అధికారికంగా ప్రభుత్వం వెల్లడించిన కరోనా మరణాల కంటే అధికంగా చోటుచేసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ఓ రిపోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మన దేశంలో సుమారు 4.8 లక్షల కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కానీ, వీటిని కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ 47 లక్షల కరోనా మరణాలు మన దేశంలో చోటుచేసుకున్నాయని వివరించింది. అయితే, ఇలా భారత ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కుట్రలు జరిగి ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి అనుమతించని దిగ్గజ ఫార్మా సంస్థల కుట్ర కూడా అయి వుండొచ్చని వివరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థను ప్రభావితం చేసే దిగ్గజ ఫార్మా సంస్థలు కుట్ర చేసి ఉండొచ్చనే వాదనలను తాము కొట్టి పారేయలేమని పేర్కొన్నాయి. భారత్‌లోకి అనుమతి నిరాకరించిన దిగ్గజ కరోనా టీకా కంపెనీల ఒత్తిడితో డబ్ల్యూహెచ్‌వో తప్పుడు మెథడాలజీని ఎంచుకోవచ్చని వివరించాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా అధికారిక లెక్కల కంటే కూడా ఎక్కువగా కరోనా మరణాలు చోటుచేసుకున్నట్టు చూపే తప్పుడు లెక్కింపు విధానాన్ని ఎంచుకుంటున్నదని, త్వరలోనే ఈ రిపోర్టు విడుదల చేయబోతున్నట్టు ముందుగానే సమాచారం రాగానే కనీసం తొమ్మిది లేఖలను ప్రభుత్వం పంపినట్టు సమాచారం. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎ న్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రిపోర్టు విడుదలకు నవంబర్ నుంచే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఆ రిపోర్టుకు కూడా పలుమార్లు సవరింపులు జరిగినట్టు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా ఎక్కువ కరోనా మరణాలు చూపించే రిపోర్టు విడుదల చేయడం మూలంగా ప్రభుత్వం కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోలేదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి చేర్చి వ్యతిరేకత పెంచాలనే కుట్ర ఇందులో ఉన్నట్టు వివరించాయి. కాగా, ఈ రిపోర్టు విడుదల కాగానే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే.