దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మరో విషయాన్ని గుర్తించారు. రెండో దశలో కరోనా వైరస్ తన రూపాన్ని, లక్షణాలను మార్చుకున్నట్లు తెలుసుకున్నారు.

మొదటి దశతో పోలిస్తే సెకండ్ వేవ్ లో బాధితుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ తీరు మారిందని, లక్షణాల్లోనూ మార్పు కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతోంనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కరోనా బాదితులకు జ్వరం, జలుబు, దగ్గు ఒళ్లు నొప్పులు, తలనొప్పి వచ్చేవి. వాసన, రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి కనిపించేవి. అప్పట్లో చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా రెండో దశలో మాత్రం వైరస్ సోకినవారిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. 

కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, శ్వాస సరిగా ఆడకపోవడం, చికాకు వంటివి కనిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.