దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది రెండో దశలో కొత్త కేసులు పైపైకి ఎగబాకుతున్నాయి.గడచిన 24 గంటల్లో 10 ,60,971 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,953 కేసులు వెలుగు చూశాయి.

సుమారు నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో రోజువారీ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.15 కోట్లకు పైబడింది. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 188 మంది మృతి చెందగా, నిన్నటివరకూ 1,59,558 మంది ప్రాణాలు వదిలారు. ఇక క్రియాశీల కేసులు 2,88,394కి పెరిగాయి. 

నిన్న ఒక్కరోజే 23,653 మంది  వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా వైరస్ ను జయించిన వారి సంఖ్య 1,11,07,332కి చేరగా రికవరీ రేటు 96.26శాతంగా ఉంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.

ఇక మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. మొదటి దశ కంటే రెండో దశలో వైరస్ ఉదృతి తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో శుక్రవారం రికార్డు స్థాయిలో 25,681 కొత్త కేసులు నమోదయ్యాయి వాటిలో మూడు వేలకు పైగా కేసులు ముంబైలోనే బయటపడ్డాయి. 2020 అక్టోబర్ 7న అత్యధికంగా 2,848 కొత్త కేసులు వెలుగు చూడగా,, రెండో దశలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మార్చి 14 నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఒక్క ఆర్థిక రాజధానిలోనే 13,912 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది.

దీంతో మహమ్మారి తీవ్రతను కట్టడి చేసే క్రమంలో కంటైన్మెంట్ జోన్లు, సీల్ చేసిన భవనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి 18 నాటికి 34 కంటెంట్మెంట్ జోన్లు ఉండగా, 305 భవనాలను బీఎంసీ సీల్ చేసింది.

మరోవైపు జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో మార్చి 1న రెండో దశను కూడా ప్రారంభించింది. కాగా మార్చి 19 నాటికి 4,20,63,392 మందికి ప్రభుత్వం టీకాలు సరఫరా చేసింది. నిన్న ఒక్కరోజే 27,23,575 మంది టీకాలు వేయించుకున్నారు.