కన్యాకుమారి: కేవలం పరోటా కోసం క్వారంటైన్ కేంద్రం నుండి బయటకు వచ్చాడు ఓ కరోనా రోగి. ఇందుకోసం అతడు పెద్ద సాహసమే చేశాడు. క్వారంటైన్ కేంద్రమే కాదు మరో నాలుగు ఇండ్ల గోడలు దూకి చివరకు పరోటాను సాధించాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటు చేసుకుంది. 

కన్యాకుమారి జిల్లా అసారిపళ్లంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో  కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇందులో 150మంది పాజిటివ్ గా నిర్దారణ అయిన రోగులున్నారు. రోగులు బయటకు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు  కూడా ఏర్పాటుచేశారు అధికారులు. అయినప్పటికి ఓ కరోనా పేషంట్ అందరి కళ్లుగప్పి ఈ క్వారంటైన్ కేంద్రం నుండి బయటకు వెళ్లాడు. అది కూడా పరోటా కోసం. 

read more   భార్యకు కరోనా... తెలిసికూడా హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లిన భర్త

పాఠశాల చుట్టూ వున్న పెద్ద కాంపౌడ్ వాల్ ను దూకి పక్కనే ఇంటి ఆవరణలోకి చేరుకున్నాడు కరోనా రోగి. అక్కడినుండి ఐదారు ఇండ్ల కాంపౌండ్ వాల్స్ దూకి రోడ్డుపైకి చేరుకున్నాడు. ఓ  హోటల్ కు వెళ్లి పరోటాలను పార్శిల్ తీసుకుని మళ్లీ క్వారంటైన్ కేంద్రానికి చేరుకున్నాడు. 

అయితే అతడు క్వారంటైన్ కేంద్రం, ఇండ్ల గోడలు దూకుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్త బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరస్ గా మారింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులు బయటకు రాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని... లేదంటే వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.