కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ కలకలం రేపడం మొదలైంది. తగ్గిపోయిందని ప్రజలంతా రిలాక్స్ అయిపోయిన సమయంలో.. మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. మళ్లీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు పెరగడం మొదలైంది.

తాజాగా కరోనా సోకిందని భయంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోని బాత్రూమ్‌లోకి వెళ్లి ఆక్సిజన్‌ పైప్‌తో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి 81 ఏళ్ల వృద్ధుడు. కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన మార్చి 26వ తేదీన నాగ్‌పూర్‌లోని బోధన ఆస్పత్రి (జీఎంసీహెచ్‌)లో చేర్చారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం ఆయన బాత్రూమ్‌లోకి వెళ్లి ఆక్సిజన్‌ పైప్‌కు ఆత్మహత్య చేసుకున్నారు. శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది పైప్‌కు వేలాడుతున్న అతడిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తితో వృద్ధులను కుటుంబసభ్యులు ఆదరించడం లేదు. ఒకవేళ కరోనా సోకితే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్తున్నారు. వారి ఆరోగ్యం కుదుటపడిన కూడా ఇళ్లకు తీసుకెళ్లని ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. అలాంటి బాధతోనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ఇదే ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు కరోనా బాధితులను పడుకోబెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని చెబుతున్నారు.