Coromandel Train Accident: యుద్ద ప్రతిపాదికన కొనసాగుతోన్న పునరుద్ధరణ పనులు
Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదం తరువాత ట్రాక్ నుండి శిధిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారు, 1000 మందికి పైగా గాయపడ్డారు.
Coromandel Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత నిరంతర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో ఇంకా పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. రైళ్ల శిథిలాలు, దెబ్బతిన్న కోచ్‌లను ట్రాక్‌పై నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 56 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటనాస్థలిని సందర్శించి ప్రమాదాన్ని పరిశీలించారు. దేశంలోనే అత్యంత విషాదకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆగ్నేయ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం బృందం ట్రాక్‌ను మరమ్మతు చేసే పనిలో నిమగ్నమై ఉంది. మేమంతా పని చేస్తున్నాం. వీలైనంత త్వరగా ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారి తెలిపారు.
బుల్డోజర్ సహాయంతో డబ్బాలను తొలగిస్తున్నారు. పాడైన కోచ్‌లను ట్రాక్‌పై నుంచి తొలగించేందుకు క్రేన్‌లు, బుల్‌డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఘోర రైలు ప్రమాదం కారణంగా రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనితో పాటు.. ఈ రైలు మార్గం మళ్లీ సాఫీగా ఉండేలా ట్రాక్‌పై చెత్తను కూడా తొలగిస్తున్నారు. ప్రమాదం తర్వాత, చాలా రైళ్ల రూట్‌లను మార్చారు. చాలా రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు.
కోల్‌కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది నాల్గవ అత్యంత ఘోరమైన ప్రమాదం. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన తర్వాత గూడ్స్ రైలును ఢీకొంది. దీని తరువాత.. ఈ రైలు పలు కోచ్‌లు పక్కనే వెళ్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి.
దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘోర ప్రమాదంగా మారింది. బాధితులను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా శనివారం బాలాసోర్‌లోని ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే.. ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.