Asianet News TeluguAsianet News Telugu

బూస్టర్ డోసుగా కార్బివ్యాక్స్‌కు అనుమతి.. డీసీజీఐ నిర్ణయం.. ఎప్పుడు వేసుకోవచ్చంటే?

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన కార్బివ్యాక్స్ టీకాను బూస్టర్ షాట్‌గా వేసుకోవచ్చని డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అంటే.. ఇకపై కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా రెండో డోసు వేసుకున్నవారు ఆరు నెలల గ్యాప్ తర్వాత కార్బివ్యాక్స్‌ను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చు. 
 

corbevax approved for booster dose by DCGI
Author
New Delhi, First Published Jun 4, 2022, 7:41 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసుగా కార్బివ్యాక్స్ టీకా వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా వేసుకున్న వయోజనులు బూస్టర్ షాట్‌గా కార్బివ్యాక్స్ టీకా వేసుకోవచ్చు. కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా రెండో డోసు పూర్తయిన ఆరు నెలల తర్వాత కార్బివ్యాక్స్ టీకాను బూస్టర్ షాట్‌గా తీసుకోవచ్చు.

ఇప్పటి వరకు ఏ టీకా అయితే ప్రైమరీ డోసులుగా (ఫస్ట్, సెకండ్ డోసులు) తీసుకుంటారో అదే టీకాను బూస్టర్ షాట్‌గా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పింది. అంటే.. ఉదాహరణకు కొవిషీల్డ్ టీకాను ఫస్ట్, సెకండ్ డోసులుగా తీసుకున్నవారు.. బూస్టర్ డోసుగా కూడా అదే కొవిషీల్డ్‌ను వేసుకోవాలి. కానీ, తాజాగా డీసీజీఐ బూస్టర్ డోసుగా కార్బివ్యాక్స్ వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అంటే.. ప్రైమరీ డోసులుగా ఏ టీకా వేసుకున్నా.. బూస్టర్ డోసుగా కార్బివ్యాక్స్ వేసుకోవచ్చని స్పష్టం చేసినట్టయింది. అయితే.. ఏ టీకా అయినా.. రెండో డోసు పూర్తయిన ఆరు నెలలకు కార్బివ్యాక్స్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు.

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ అనే ఫార్మా సంస్థ కార్బివ్యాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దేశంలో బూస్టర్ డోసు తీసుకోవాల్సిన ప్రాధాన్యతను ఈ నిర్ణయం నొక్కి చెప్పిందని బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల డీసీజీఐ ప్రకటనపై స్పందించారు. ఈ అనుమతితో కార్బివ్యాక్స్ టీకా ప్రపంచ శ్రేణి నాణ్యత, ప్రమాణాలను మరోసారి రుజువు చేసుకున్నదని వివరించారు. కార్బివ్యాక్స్‌కు అధిక రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసే సామర్థ్యం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

ఈ టీకాను బూస్టర్ డోసుగా తీసుకోవాలనుకుంటే.. ఎప్పట్లాగే కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అందులో బూస్టర్ షాట్‌గా కార్బివ్యాక్స్ టీకాను ఎంచుకోవాలి.

ఇప్పటి వరకు మన దేశంలో 51.7 మిలియన్ డోసుల కార్బివ్యాక్స్ టీకాను పంపిణీ చేశారు. కార్బివ్యాక్స్ టీకాను మన దేశంలో పిల్లలకు వేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో 12 నుంచి 14 ఏళ్ల వయసున్న చిన్నారుకుల కార్బివ్యాక్స్ వేయడానికి తొలుత డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకూ ఈ టీకా వేయవచ్చని అత్యవసర వినియోగ అనుమతులను ఏప్రిల్‌లో ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios