నేలపై పోలీసుల నిద్ర: ఫొటోలు వైరల్, కరోనా సమరయోధులకు థ్యాంక్స్
నేలపై నిద్రిస్తున్న ఇద్దరు పోలీసుల ఫొటోను ఐపిఎస్ అధికారి మాధుర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. నిద్ర కూడా లగ్జరీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇరువురు పోలీసులు నేలపై పడుకుని నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ మాధుర్ వర్మ ఆ ఫొటోలను షేర్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో యుద్ధం చేస్తున్న యోధులంటూ ఆ ఇద్దరిపై మాధుర్ ప్రశంసలు కురిపించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వైద్యులు, నర్సుల వంటి వైద్య సిబ్బందితో పాటు పోలీసులు కూడా కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాటం చేస్తున్నారు.
వారిలో చాలా మంది కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ విధుల్లో పోలీసుల అంకిత భావాన్ని మాధుర్ ప్రశంసిస్తూ పోలీసు కావడం వల్ల సౌకర్యవంతమైన పడకపై ఎనిమిది గంటల నిద్ర కూడా లగ్జరీగా మారిందని ఆయన అన్నారు.
శీర్షిక పెట్టి ఆ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన మరుక్షణం 29 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. 5 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఆ ఇద్దరు పోలీసులను ప్రశంసిస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్లు పోస్టు చేశారు.