జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రాజకీయ నాయకులు, మాజీ సైనికులు, బయటి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. 

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రాజకీయ నాయకులు, మాజీ సైనికులు, బయటి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లో భారత్ సైన్యం జరిపిన భారీ ఆపరేషన్ కారణంగా ఉగ్రవాదులు దాడులుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో ఇటీవల ఒక స్థానిక ఉగ్రవాది, ఇద్దరు పాకిస్తానీ లష్కరేటర్ ఉగ్రవాదుల కదలికలను కూడా గుర్తించాయి. ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లు లేదా ఐఈడీలను ఉపయోగించి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాల్లో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. పుల్వామాలోని ఖండిపోరాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, అనంత్‌నాగ్‌లోని సేమ్‌థాన్‌లో ఒకరు హతమయ్యారని పోలీసులు చెప్పారు. 

మరోవైపు శ్రీనగర్, బుద్గామ్ జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా ఖండిపోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టడం భద్రతా దళాలకు పెద్ద విజయం అని కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపును పరిశీలిస్తున్నామని చెప్పారు.