అతను ఓ దొంగ.. ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడినా వెంటనే కాజేస్తాడు. తమ ఫోన్ పోయిందని బాధితుడు గుర్తించేలోపే అక్కడి నుంచి ఉడాయిస్తాడు. పైగా తాను ఒక పోలీసునంటూ అవతలివారిని బురిడికొట్టిస్తాడు. కాగా... ఈ కేటుగాడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసునంటూ పరిచయం చేసుకొని ప్రజల వద్ద సెల్‌ఫోన్లు తీసుకొని ఉడాయిస్తున్న గాయత్రినగరకు చెందిన మహేశ్‌ నాయక్‌(42) అనే వ్యక్తిని సుబ్రహ్మణ్య నగర పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడినుంచి 2.87 లక్షలు విలువైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేదమూర్తి అనే వ్యక్తి ఈనెల 8న జీకే ప్రింటింగ్‌ పాయింట్‌ వద్ద కారు నిలిపాడు. 

అక్కడే ఉన్న నిందితుడు తాను పోలీసునంటూ పరిచయం చేసుకొని తన పై అధికారికి కారు అద్దెకు కావాలని రాజాజీనగర 17వ క్రాస్‌ వద్దకు తీసుకెళ్లాడు. అధికారితో మాట్లాడాలంటూ వేదమూర్తినుంచి సెల్‌ఫోన్‌ తీసుకొని ఉడాయించాడు. అదేవిధంగా 2019లో జేసీనగర పోలీసుస్టేషన్‌ పరిధిలో బైక్‌ చోరీ చేసి నంబర్‌ ప్లేట్‌ మార్చి సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై రాజాజీనగర, జేసీ నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో పలు చోరీ కేసులున్నాయి.