కోవిడ్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్.. తన తోటి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన జంషెడ్ పూర్ నగరంలో వెలుగుచూసింది. జంషెడ్ పూర్ నగరంలోని సిద్ గోరా ప్రొఫెషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ అనిల్ కుమార్, మరో మహిళా కానిస్టేబుుల్ తో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా.. కోవిడ్ కేంద్రంలోని భవనంపై అంతస్తులో కరోనా వైరస్ ప్రభావం ఉండదని, అక్కడ సురక్షితమని చెప్పి నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మింది. కాగా మహిళా కానిస్టేబుల్ ను పై గదిలోకి తీసుకువెళ్లిన కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె అరవకుండా నోరు మూసి మరీ దారుణానికి ఒడిగట్టాడు. కాగా.. బాధితురాలు మరుసటి రోజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత మహిళా కానిస్టేబుల్ ను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.ఐపీసీ సెక్షన్ 376 (2) ప్రకారం కేసు నమోదు చేసి, నిందితుడైన కానిస్టేబుల్ అనిల్ కుమార్ ను అరెస్టు చేశామని పోలీసుఅధికారి మనోజ్ ఠాకూర్ చెప్పారు. బాధిత మహిళా కానిస్టేబుల్ భర్త విధి నిర్వహణలో మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది.