మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తిరుగుబాటు సమయంలో బీజేపీలో చేరిన ఓ నేత తిరిగి కాంగ్రెస్ లోకి మారాడు. అయితే దీనికోసం 400 కార్ల కాన్వాయ్ తో వెళ్లడం ఇప్పుడు వైరల్ అవుతోంది. 

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని శివపురి నుండి భోపాల్ వరకు దాదాపు 300 కి.మీ దూరం.. 400 కార్ల కాన్వాయ్.. ఇది ఓ బీజేపీ నేత.. కాంగ్రెస్ చేరడానికి వెడుతున్నప్పటి సీన్. ఇది భోపాల్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఓ నేత ఇప్పుడు అట్టహాసంగా తిరిగి కాంగ్రెస్ లోకి చేరాడు.
2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో తిరుగుబాటుకు మద్దతునిచ్చి కాంగ్రెస్‌నుంచి బిజెపిలోకి వెళ్లాడు బైజ్‌నాథ్ సింగ్.

ఆయనే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. బైజ్‌నాథ్ సింగ్ కు శివపురిలో రాజకీయ పలుకుబడి బాగా ఉంది. 2020 మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తిరుగుబాటు సమయంలో జ్యోతిరాధిత్య సిందియాతో చేతులు కలిపి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి, బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో సింధియాతో పాటు బిజెపిలోకి వచ్చారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సింధియా ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో బీజేపీ టికెట్ కోసం బైజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా లాబీయింగ్ చేసినా ఫలితం కనిపించడం లేదట. టికెట్ దక్కే ఆశ లేకపోవడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్‌లు అతడిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బైజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీకి చెందిన 15 మంది జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్‌లోకి మారారు.

బీహార్ సీఎం నితీష్‌ భద్రతా వలయంలోకి దూసుకొచ్చిన బైక్.. ఫుట్‌పాత్‌పైకి దూకిన సీఎం..

తన పార్టీ మారడానికి గుర్తుగా, బైజ్‌నాథ్ సింగ్ శివపురి నుండి భోపాల్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి 400 కార్ల కాన్వాయ్ ను తీసుకెళ్లారు. ఆ 400 కార్లు సైరన్‌లు మోగించుకుంటూ వెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రజలు వీడియోలు షూట్ చేయడం, కార్ల వైపు చేతులు ఊపడం కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఈ కాన్వాయ్ లోని ఎన్వీయూలను బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ చిత్రం సింఘమ్‌లోని సన్నివేశాలతో పోల్చారు.

కొంతమంది సైరన్‌లు వాడడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం, అత్యవసర సేవలను అందించే వాహనాలు మాత్రమే రోడ్డుపై సైరన్‌లను మోగించాలని.. వీటిలో అంబులెన్స్‌లు, అగ్నిమాపక దళం, పోలీసులు ఉన్నాయని తెలిపారు. కానీ రాజకీయ నాయకులు దీనిని తరచుగా తమ బలప్రదర్శనకు వాడడం ఏంటని ప్రశ్నించారు. కార్లమీద ఎర్రబుగ్గను నిషేధించినా ఈ విపరీతాలేంటని మండి పడుతున్నారు. 

సైరన్‌ల వాడకం కాంగ్రెస్‌ ఫ్యూడల్‌ మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తోందని బీజేపీ పేర్కొంది. ‘హూటర్లు, సైరన్లు, అక్రమ బీకాన్‌లు వాడి ప్రజలకు ఇబ్బంది కలిగించే కాంగ్రెస్ నేతల మనస్తత్వం ఇదీ.. వీఐపీ సంస్కృతిని వీధుల్లోకి రానీయకుండా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకెళ్లారు.. కానీ కాంగ్రెస్ ఫ్యూడల్ మైండ్‌సెట్ వల్లనే హూటర్లు వాడే పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శిస్తున్నాను. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ బాజ్‌పేయి తెలిపారు.