హనుమంతి జన్మస్థలంపై వివాదం రాజుకుంటున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లోని పలువురు వాదిస్తున్నట్టుగా హనుమంతుడి జన్మస్థలం కిష్కింద, అంజనేరి పర్వతమో, ఏపీలో పేర్కొంటున్నట్టు అంజనాద్రి కాదని బీజేపీ నేత కుమారుడు శ్రీనివాస్ ఖలాప్ అన్నాడు. ఇవన్నీ కాదనీ, హనుమంత్ జన్మించింది గోవాలోని అంజెదివా ద్వీపంలోనేని, వాల్మీకి రామాయణం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నదని తెలిపాడు.

పనాజీ: రామ జన్మ స్థలం గురించి వివాదం లేదు. అయోధ్య అని స్పష్టం. కానీ, రామ భక్త హనుమంతుడి జన్మస్థలం మాత్రం తీవ్ర చర్చ జరుగుతున్నది. పండిత ఉద్ధండుల మధ్యే తీవ్ర వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇదిమిద్దంగా ఇదీ హనుమంతుడి జన్మస్థలం అని తేలలేదు. కాగా, హనుమంతుడు తమ రాష్ట్రంలోనే జన్మించాడని ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలోని సంతులు, పండితులు చెబుతున్నారు. కానీ, అదేమీ కాదని, హనుమంతుడి జన్మస్థలం గోవాలోని ఓ దీవి అని బీజేపీ నేత కుమారుడు తాజాగా వాదిస్తున్నాడు.

హనుమంతుడి జన్మస్థలం పై ధర్మ సంసద్ కూడా జరిగింది. కానీ, పండితుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. హనుమంతుడి జన్మస్థలంపై ఏకాభిప్రాయానికి రావడానికి ధర్మ సంసద్‌ను వాయిదా వేశారు. హనుమంతుడి జన్మస్థలం కర్ణాటకలోని కిష్కింధనో ఏపీ తిరుమల కొండల్లోని అంజనాద్రినో, మహారాష్ట్రలోని అంజనేరి పర్వత ప్రాంతమో కాదని తాజాగా, బీజేపీ సీనియర్ నేత కుమారుడు పేర్కొన్నాడు. గోవాలోని అంజెదివా ద్వీపమే హనుమంతుడి జన్మస్థలం అని వాదిస్తున్నాడు.

మాజీ న్యాయ శాఖ మంత్రి రమాకాంత్ ఖలాప్ తనయుడు, హిస్టరీ రీసెర్చర్, అడ్వకేట్ శ్రీనివాస్ ఖలాప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడి జన్మస్థలం ప్రస్తుతం గోవాలోని అంజెదివా ఐలాండ్ అని వాదిస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణంలోనే హనుమంతుడు గోవాలో జన్మించాడని చెబుతుండగా కర్ణాటక, మహారాష్ట్రలు ఎందుకు హనుమంతుడి జన్మస్థలంపై గగ్గోలు పెడుతున్నాయని వాదించాడు. 

వాల్మీకి రామాయణం ప్రకారం, హనుమాన్ తల్లి అంజనీ దేవి సముద్రం పక్కనే ఉన్న ఓ ద్వీపంలో తపస్సు చేసిందని శ్రీనివాస్ ఖలాప్ అన్నాడు. వాయు దేవుడి వరంతో అంజనీ దేవి హనుమంతుడికి జన్మ ఇచ్చిందని వివరించాడు. ఆ ద్వీపం పేరే అంజనీ ద్వీప్ అని తెలిపాడు. కానీ, కాలక్రమేణ దాని పేరు అంజెదివా ద్వీపంగా రూపాంతరం చెందిందని వివరించాడు. ఈ ద్వీపం ప్రస్తుతం కార్వార్ సమీపంలో ఉన్నదని తెలిపాడు. చారిత్రక కోణాల్లో పరిశీలిస్తే ఈ ద్వీపం గోవాలోనే ఉన్నదని తెలుస్తున్నదని వివరించాడు. కాబట్టి.. హనుమంతుడు గోవాలనే పుట్టాడని నిర్వివాదంగా, నిశ్చయంగా చెప్పవచ్చని అన్నాడు. కొంతకాలంగా హనుమంతుడి జన్మస్థలంపై దుమారం రేగుతున్నది. పండితులు తరచూ వాదనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత తనయుడు శ్రీనివాస్ ఖలాప్ పై వ్యాఖ్యలు చేశాడు.