వివాదాస్పద నేత, ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూత..
Shafiqur Rahman Barq : సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూశారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
సమాజ్ వాదీ పార్టీ సంభాల్ ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ మంగళవారం మరణించారు. గత కొంత కాలంగా వృధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..94 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఎంతో సమాజ్ వాదీ పార్టీకి సేవలందించిన ఆయన ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ టిక్కెట్ కేటాయించింది.
కొంత కాలం కిందట ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ అనారోగ్యానికి గురికావడంతో మొరాదాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ఈ నెల 21వ తేదీన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మరణం పట్ల అఖిలేష్ యాదవ్ స్పందించారు. తమ పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా పనిచేసిన షఫీకుర్ రెహ్మాన్ బార్క్ సాహెబ్ మృతి బాధాకరమని వ్యక్తం చేశారు.
కాగా.. షఫీకుర్ రెహ్మాన్ బార్క్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. కోవిడ్ పై కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ 'పొలిటికల్ కరోనా'ను వాడుకుంటోందని ఆరోపించారు. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హత్యకు గురైన తర్వాత వారికి న్యాయం జరగలేదని బార్క్ పేర్కొన్నారు.