Asianet News TeluguAsianet News Telugu

Ajmer Dargah Cleric: నుపూర్ శ‌ర్మ‌పై తీవ్ర వ్యాఖ్య‌లు.. అజ్మీర్ దర్గా మతాధికారి అరెస్ట్

Ajmer Dargah Cleric Arrested: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ‌పై తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేసిన అజ్మీర్ ద‌ర్గా మ‌తాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. 
 

Controversial comments on Nupur Sharma; Ajmer Dargah Cleric Arrested
Author
Hyderabad, First Published Jul 6, 2022, 12:04 PM IST

Nupur Sharma-Ajmer Dargah Cleric: భార‌తీయ జ‌నతా పార్టీ మాజీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ.. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇంకా కాక‌రేపుతున్నాయి. దేశంలోనే కాకుండా అంత‌ర్జాతీయంగా ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఇప్ప‌టికీ ప‌లు వ‌ర్గాలు ఆమెపై తీవ్రంగా స్పందిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్‌లోని అజ్మీర్ ద‌ర్గాలో మ‌తాధికారికి కొన‌సాగుతున్న స‌ల్మాన్ చిస్తీ.. నుపూర్ శ‌ర్మ‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇస్లాం స్థాప‌కుడు మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను కించ‌ప‌రుస్తూ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నుపూర్ శ‌ర్మ త‌ల న‌రికి తెచ్చిన వారికి త‌న ఇల్లును రాసిస్తాన‌ని స‌ల్మాన్ చిస్తీ ఓ వీడియో విడుద‌ల చేశాడు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అయితే, ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొడుతూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన అజ్మీర్ ద‌ర్గా మ‌తాధికారి స‌ల్మాన్ చిస్తీపై కేసు న‌మోదైంది. బుధ‌వారం నాడు ఆయ‌న‌ను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు చెందిన మతగురువును బుధ‌వారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న అంత‌కుముందు  సస్పెండ్ చేయబడిన భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికార‌ ప్రతినిధి నుపూర్ శర్మ.. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే నుపూర్ శ‌ర్మ‌ తల నరికి చంపినవారికి పారితోషికంగా త‌న ఇంటిని రాసిస్తాన‌ని వీడియో విడుద‌ల చేశాడు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో నిరసనలు, గల్ఫ్ దేశాల నుండి తీవ్ర‌ ఖండనలను రేకెత్తించాయి. సోమవారం రాత్రి వీడియో క్లిప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత రాజస్థాన్ పోలీసులు సల్మాన్ చిస్తీ కోసం వెతుకుతున్నారు. ఆ వీడియో క్లిప్ లో నూపుర్ శర్మ తలను తన వద్దకు తీసుకువచ్చే ఎవరికైనా తన ఇంటిని ఇస్తానని మత గురువు చెప్పాడు. ప్రవక్తను అవమానించినందుకు ఆమెను కాల్చి చంపేస్తానని కూడా అతను చెప్పాడు. 

"మీరు అన్ని ముస్లిం దేశాలకు సమాధానం ఇవ్వాలి. నేను రాజస్థాన్‌లోని అజ్మీర్ నుండి చెబుతున్నాను.. ఈ సందేశం హుజూర్ ఖ్వాజా బాబా కా దర్బార్ నుండి వ‌స్తోంది" అని అతను వీడియోలో ప్రఖ్యాత సూఫీ పుణ్యక్షేత్రాన్ని ప్రస్తావిస్తూ చెప్పాడు. కాగా, నిందితుడికి నేర చరిత్ర ఉందని పోలీసు అధికారి దల్వీర్ సింగ్ ఫౌజ్దార్ తెలిపినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. అజ్మీర్ దర్గా దేవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ కార్యాలయం ఈ వీడియోను ఖండించింది. ఈ మందిరం మత సామరస్య ప్రదేశమని పేర్కొంది. వీడియోలో 'ఖాదీం' వ్యక్తం చేసిన అభిప్రాయాలను దర్గా నుండి వచ్చిన సందేశంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఒక వ్యక్తి చేసిన ప్రకటన అని, ఇది తీవ్రంగా ఖండించదగినదని పేర్కొంది.

ఇదిలావుండ‌గా, నుపూర్ శర్మకు మద్దతుగా తన సోషల్ మీడియా వేదిక‌గా పోస్టు చేసిన ఉద‌య్‌పూర్ లోని టైల‌ర్ క‌న్హ‌య్య లాల్ కు మొద‌ట బెదిరింపులు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఇద్ద‌రు దుండ‌గులు షాపులోకి ప్ర‌వేశించి క‌న్హ‌య్య లాల్ ను అతి క్రూరంగా ప‌దునైన ఆయుధాల‌తో గొంతు నరికి చంపారు. ఈ దారుణానికి పాల్ప‌డిన ఇద్ద‌రు నిందితులు ఈ హ‌త్య‌ను తామే చేశామ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. వారు "ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నాం" అని చెప్పారు. నిందితులైన‌ రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ హత్య గురించి గొప్పగా చెప్పుకునే మరో వీడియోను విడుదల చేశారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించారు. దీని త‌ర్వాత ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీసులు హెచ్చ‌రించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios