విధులుకు ఎందుకు హాజరయ్యావో కారణం చెప్పాలని అడిగిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఓ కానిస్టేబుల్ దిమ్మ తిరిగే జవాబిచ్చాడు

విధులుకు ఎందుకు హాజరయ్యావో కారణం చెప్పాలని అడిగిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఓ కానిస్టేబుల్ దిమ్మ తిరిగే జవాబిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు జయనగర పోలీస్ స్టేషన్‌లో 5 మంది గస్తీ సిబ్బంది నిత్యం విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న అభియోగంపై సీఐ యర్రిస్వామి వారికి నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసుకు శ్రీధర్ అనే కానిస్టేబుల్ ఓ లేఖలో దిమ్మ తిరిగే జవాబిచ్చాడు. ‘‘ మీ లాగా ఉదయం సుఖసాగర్ లేదా యుడి హోటల్‌లో టిఫిన్, మధ్యాహ్నం ఖానావళిలో భోజనం, రాత్రి ఎంపైర్‌లో భోజనం, మిలనోలో ఐస్‌క్రీం తిన్న తర్వాత పోలీస్ స్టేషన్ పైన ఉన్న గదిలో ఇళ్లు ఉన్నట్లుయితే తాను కూడా ఉదయం తీరిగ్గా విధులకు హాజరయ్యే వాడిని..

కానీ నాకు వయసు మీద పడిన తల్లిదండ్రులు, పోలీస్ శాఖలోనే పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆలనాపాలన చూసిన అనంతరం విధులకు రావడం ఆలస్యమవుతోంది.

ఇందులో తాను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించలేదని శ్రీధర్ సమాధానమిచ్చాడు. దీంతో ఈ లేఖ కన్నడ పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్య తీసుకుంటారోనని సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది.