సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేఐపై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను అస్ధిర పరిచేందుకు తీవ్ర స్థాయిలో కుట్ర జరుగుతోందన్నారు.

న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ మీద ప్రస్తుతం విచారణ చేయాల్సి ఉందని.. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. అందుకే అఫిడవిట్‌లోని వ్యాఖ్యలపై విచారణ జరుగుతోందని అరుణ్ మిశ్రా అన్నారు.

సీజేఐపై ఎవరు కుట్రకు పూనుకున్నారు.. దీని మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిన్స్ ఆరోపణలు నిజమైతే న్యాయవ్యవస్ధ పెను ప్రమాదంలో చిక్కుకున్నట్లేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

అయితే సరైన ఆధారాలు లేకుండా అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తారని ఏజీ వేణుగోపాల్ ప్రశ్నించగా.. తన నిజాయితీపై అందరూ దాడి చేస్తున్నారని బెయిన్స్ ఆరోపించారు. తన వాదనకు బలం చేకూరేలా ఆధారాలు సమర్పించడానికి మరో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఆయన తెలిపారు.