ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచే నేరాలు కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం 81 మంది జైలు అధికారులకు లంచాలు ఇచ్చినట్టు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే తన పని కోసం ఓ నర్సింగ్ స్టాఫ్‌ను ఉపయోగించుకున్నట్టు సుకేశ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

న్యూఢిల్లీ: ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ నేరాలు ఊహించలేకుండా ఉంటాయి. చిన్న వయసులోనే నేర సామ్రాజ్యంలోకి వెళ్లిన ఆయన మనీ లాండరింగ్.. ఇతర కీలక వ్యక్తుల తీరులో మాట్లాడి దోపిడీకి పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ఆయన ఢిల్లీలో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, జైలు శిక్ష పడి జీవితం నాలుగు గోడలకే పరిమితమైనా.. తన నేరాలను యథాలాపంగా కొనసాగిస్తుండటం సంచలనంగా మారింది. ఇందుకోసం ఏకంగా 81 మంది జైలు అధికారులకు లంచం ఇచ్చినట్టు తెలుస్తున్నది.

జైలు అధికారులనే లోబర్చుకుని నేరాలను కొనసాగిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విభాగం గుర్తించింది. అధికారుల నుంచే ఫోన్లు, ఇతర సౌకర్యాలను సుకేశ్ చంద్రశేఖర్ పొందినట్టు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పేర్కొంది. అందుకే జైలు అధికారులపై కేసు నమోదు చేసినట్టు వివరించింది. 81 మంది అధికారులపై కేసు నమోదు చేసినట్టు తెలిపింది.

ఈ నెల మొదట్లో సుకేశ్ చంద్రశేఖర్ ఓ నర్సింగ్ స్టాఫ్‌ను తన పని కోసం వాడుకున్నట్టు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన మనిషిని కలవడానికి ఆయన నర్సింగ్ స్టాఫ్ సహకారం తీసుకున్నారు. 

మనీలాండరింగ్, అనేక మందిని మోసం చేసి డబ్బు దండుకున్న అభియోగాల కింద ప్రస్తుత సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య ఇరువురూ జూన్ నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించి జైలు అధికారులు, సిబ్బంది ద్వారా తమకు ప్రాణ హాని ఉన్నదని, వారి నుంచి తరుచూ బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టు ఆరోపించారు. ప్రాణ హాని ఉండటం మూలంగా రక్షణ కల్పించడానికి డబ్బులు కావాలని తనను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో తన నుంచి సుమారు రూ. 12.5 కోట్ల డబ్బును తిహార్ జైలు సిబ్బంది బలవంతంగా లాక్కుందని అంటే బెదిరించి తీసుకుందని పేర్కొన్నారు.

సుకేశ్ చంద్రశేఖర్ చదివింది 12వ తరగతే. కానీ, మోసాల్లో తనది అందెవేసిన చేయి. హై ఎండ్ టెక్నాలజీని వాడుతూ మోసాలకు పాల్పడ్డాడు. నేర సామ్రాజ్యంలోకి 17ఏళ్లలోనే ప్రవేశించాడు. 17ఏళ్ల వయసులోనే తొలిసారి 2007లో అరెస్టు అయ్యాడు. ఓ బిజినెస్‌మెన్‌ను రూ. 1.15 కోట్లు చీట్ చేసి జైలుకెళ్లాడు. మూడేళ్ల తర్వాత యాక్టర్ లీనా పాల్‌ను కలిశాడు. ఐదేళ్ల తర్వా పెళ్లి చేసుకున్నాడు. కానీ, లీనా పాల్ లైఫ్‌స్టైల్‌కు కావాల్సినవి సమకూర్చి పెట్టడానికి సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం ప్రయత్నించాడని, తర్వాత లీనా కూడా తన నేరాల్లో భాగస్వామ్యం పంచుకున్నట్టు సుకేశ్ పోలీసులకు వెల్లడించారు.

మాజీ ఫోర్టిస్ హెల్త్‌కేర్, ర్యాన్‌బాక్సీ ల్యాబ్ ప్రమోటర్లు శివిందర్, మల్విందర్ సింగ్ కుటుంబాన్ని సుకేశ్ చీట్ చేసి రూ. 200 కోట్లను వసూలు చేశాడు. శివిందర్ సింగ్‌ను సుకేశ్ తొలిసారి తిహార్ జైలులో కలిశాడు. శివిందర్‌కు బెయిల్ ఇప్పిస్తాననే మాటతో ఆయన కుటుంబాన్ని మోసం చేయాలనే ప్లాన్ అక్కడే మొదలైంది. శివిందర్ సింగ్ సతీమణి అదితీ సింగ్‌కు గతేడాది జూన్ 15న సుకేశ్ తొలిసారి ఫోన్ చేశాడు. హై టెక్నాలజీ యాప్‌లు వాడుతూ తన ఫోన్ నెంబర్ స్థానంలో ప్రముఖుల ల్యాండ్‌లైన్ నెంబర్లు వచ్చేలా ప్లాన్ చేశాడు. ఆ ఫోన్ కాల్‌లో తనను తాను కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకుని ఆమె భర్తకు బెయిల్ ఇవ్వడానికి ఉన్నతాధికారుల సూచనల మేరకు కాల్ చేస్తున్నట్టు ఆమెను ట్రాప్‌లో ఇరికించాడు. ఆ కాల్ నిజమని నమ్మగానే పార్టీ కోసం ఫండ్ ఇవ్వాల్సిందిగా ఆమె నుంచి డిమాండ్ చేశాడు. 

అదే యాప్‌తో ఆగస్టు 19న మరోసారి కాల్ చేశాడు. ఈసారి అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంటి నుంచి ల్యాండ్‌లైన్ కాల్ వచ్చినట్టుగా నమ్మించాడు. తర్వాతి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ వచ్చినట్టు యాప్ ద్వారా మోసం చేశాడు. అంతేకాదు, ఈ ఫోన్ సంభాషణ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వింటున్నాడని, జాగ్రత్తగా మాట్లాడాలని సూచనలూ చేశాడు. ఫోన్ కాల్ అయిపోగానే చివరన జై హింద్ అని ముగించేవాడు. జూన్ 2020 నుంచి ఆగస్టు 2021 వరకు సుకేశ్ చంద్రశేఖర్ రూ. 201.75 కోట్ల సొమ్మును వసూలు చేశాడు.