న్యూఢిల్లీ: 24 గంటల పాటు శస్త్రచికిత్స చేసి నడుము భాగంలో అతుక్కొని పుట్టిన అవిభక్త  కవలలను ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా విడదీశారు.ఈ ఆపరేషన్ లో 64 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఈ ఆపరేషన్ అత్యంత అరుదైందని చెబుతున్నారు.

ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మిను బాజ్ పాయ్ నేతృత్వంలో వైద్యులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. రెండు నెలల వయస్సు నుండి  పిల్లలు మిను బాజ్ పాయ్ పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం వీరి వయస్సు రెండేళ్లు. పిల్లల శరీరం శస్త్ర చికిత్సకు అనుకూలంగా ఉండడంతో ఆపరేషన్ నిర్వహించారు.

also read:జూన్‌లో కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే ఛాన్స్: నిపుణుల వార్నింగ్

ఇద్ద‌రి శిశువుల‌ వెన్న‌ముక‌ ద‌గ్గ‌ర త‌గినంత చ‌ర్మం లేక‌పోవ‌డంతో గుండె, ప్ర‌ధాన ర‌క్త‌నాళాలకి స‌రిగ్గా రక్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో ఆప‌రేష‌న్ స‌మ‌యంలో చాలా స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నట్టుగా వైద్యులు చెప్పారు. ఈ కేసును లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆపరేషన్ నిర్వహించినట్టుగా చెప్పారు.

అనస్థీషియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ,  సి.టి.వి.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రేడియోడయాగ్నోసిస్, న్యూరోఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్ ,  పారామెడికల్ సిబ్బంది ఓ జ‌ట్టులా ఏర్ప‌డి 24 గంట‌ల‌పాటు సుధీర్ఘంగా క‌ష్ట‌ప‌డి ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.ఈ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల క‌వ‌ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు.