నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరికాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపనిచ్చింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరికాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ.. ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపనిచ్చింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్, సోనియాలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నిరసన తెలిపేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. 198 ముఖ్యనేతలను మాత్రమే ఏఐసీసీ కార్యాలయంలోకి అనుమతించారు. ఇక, నిరసన తెలుపుతున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బస్సుల్లో అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో ఆ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఇక, రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు పాదయాత్రగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. లా అండ్ ఆర్డర్‌ను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించినట్టుగా పోలీసులు తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం దగ్గర పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాహుల్ గాంధీతో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు.