కర్ణాటకలోని హుబ్లీలో ఓ కాంగ్రెస్ వర్కర్ మహిళా డ్యాన్సర్ పై డబ్బు వెదజల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ వర్కర్ పై బీజేపీ విమర్శలు కురిపించింది. ఇది కాంగ్రెస్ కల్చర్ అని ఫైర్ అయింది. 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకరి తప్పులను మరొకరు పట్టుకునే పనుల్లో ఉన్నారు. తాజాగా, ఓ కాంగ్రెస్ వర్కర్ అనుచిత ప్రవర్తనను బీజేపీ ఎత్తి చూపింది. ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై కాంగ్రెస్ వర్కర్ కాసుల వర్షం కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో లీక్ అయింది. కాంగ్రెస్ వర్కర్ తీరును బీజేపీ తప్పుపట్టింది. ఇది కాంగ్రెస్ కల్చర్ అని ఘాటుగా విమర్శించింది. మహిళా దినోత్సవం రోజునే ఆ వీడియో వైరల్ అవుతుండటంతో తీవ్ర చర్చ మొదలైంది.

కర్ణాటకలోని హుబ్లీకి చెందిన కాంగ్రెస్ వర్కర్ శివశంకర్ హంపన్న ఓ పెళ్లి వేడుకకు వెళ్లాడు. ధార్వాడ్ జిల్లాలో ఓ పెళ్లి తంతులో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళా డ్యాన్స్ చేశారు. ఆమె పక్కనే నిలబడిన కాంగ్రెస్ వర్కర్ ఆమె పై డబ్బు విసిరివేయడం మొదలు పెట్టారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతున్నది.

Also Read: భార్య కోపంగా ఉంది.. నా పరిస్థితి అర్థం చేసుకుని హోలీకి సెలవులు ఇవ్వండి సార్: పోలీసు లీవ్ లెటర్ వైరల్.. జవాబిదే

ఈ ఘటన పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కర్ణాటక బీజేపీ జనరల్ సెక్రెటరీ మహేశ్ టెంగింకాయ్ మాట్లాడుతూ, ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు. తాను ఆ వీడియోను టీవీలో చూశానని చెబుతూ.. ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ ఉంటే.. ఆమె పై డబ్బు చల్లారనేది స్పష్టంగా కనిపించిందని అన్నారు. వీరికి డబ్బు విలువ తెలియదని, ఇది కాంగ్రెస్ కల్చర్ అని ఆరోపించారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్టు వివరించారు. బీజేపీ ప్రతినిధి రవి నాయిక్ కాంగ్రెస్‌ ను విమర్శిస్తూ ఆ మహిళలు, యువతులకు కాంగ్రెస్ ఎలాంటి గౌరవం ఇస్తున్నదనేదే తన ప్రశ్న అని ఫైర్ అయ్యారు. ఆ కాంగ్రెస్ వర్కర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.