మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నేడు ఫలితాలు వెలువడిన ఉప ఎన్నికల్లో.. ఒక్క హుజూర్ నగర్ తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది.  మూడు స్థానాల్లోనూ సగటున 50శాతానికి పైగా ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝూబువా అసెంబ్లీ నియోజకవర్గంలో కంతిలాల్ బురియా విజయం సాధించారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని చిత్రకోటి అసెంబ్లీ నియోజకవర్గంలో రజ్మన్ వెంజన్ గెలుపొందారు. కేంద్ర పాలిత ప్రాంతమై పాండిచ్చేరిలోని కామ్రాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జాన్ కుమార్ విజయ భేరి మోగించారు. 

మధ్యప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఇరు పార్టీల మధ్య భారీ సంఖ్యలో ఓట్ల తేడా ఉంది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం జరిగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఇప్పుడు సర్వత్రీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే... ఒక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ అంచనా తప్పింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ విఫలం చెందింది. దీంతో... ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది.