వలస కార్మికులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అండగా నిలిచారు. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు ఖర్చంతా తామే భరిస్తామని ఆమె ప్రకటించారు.  సోమవారం ఉదయం ఈ మేరకు ఆమె ప్రకటన చేశారు. అదేవిధంగా కేంద్రంలోని అధికార పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు.

ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఈనేపథ్యంలో ఎక్కువగా వలస కార్మికులు నానా అవస్థలు పడ్డారు. స్వస్థలాలకు చేరుకునేందుకు మార్గం లేక కాలినడకన వెళ్లినవారు వేలల్లో ఉన్నారు. అలా వెళ్లి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో వారిని సొంత ప్రాంతాలకు తరలిచేందుకు కేంద్రం అంగీకరించింది. కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు.

దీనిపై ఈరోజు సోనియా గాంధీ మాట్లాడారు. వలస కూలీలు ఇళ్లకు వెళ్లకుండా చిక్కుకుపోవడానికి ప్రభుత్వమే కారణమని ఘాటు విమర్శలు చేశారు . కార్మికుల కష్టాలపై ఈమేరకు ఆమె లేఖ రాశారు. వలసకార్మికుల ప్రయాణ ఖర్చు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని, స్థానిక పార్టీ నేతలు వలసకార్మికులక భరోసా నివ్వాలని పిలుపునిచ్చారు. 

దేశ విభజన సమయంలో ఏం చేశారో.. ఇప్పుడు అదేచేశారని ఆరోపించిన  సోనియా.. 4 గంటల సమయం ఇచ్చి లాక్‌డౌన్ విధించారని మండిపడ్డారు. వసల కార్మికులే దేశానికి వెన్నెముకగా అభివర్ణించిన కాంగ్రెస్ అధినేత్రి.. వారి  కష్టం, త్యాగం మన దేశానికి పునాది అన్నారు. 

విదేశాల్లో ఉన్న వారిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వల సకార్మికుల్ని సొంతూళ్లకు పంపాలేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.