జీ 20 సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ దేశాధినేతలకు అవమానం:కాంగ్రెస్, ఫేక్ న్యూస్ ప్రచారమంటూ బీజేపీ మండిపాటు
జీ20 సదస్సుకు వస్తున్న ప్రపంచ దేశాల నేతలను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తుందని కాంగ్రెస్ పార్టీ పాత ఫోటోను షేర్ చేయడాన్ని బీజేపీ తప్పు బట్టింది.

న్యూఢిల్లీ: జీ 20 సమ్మిట్ సందర్భంగా బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ప్రపంచంలోని అగ్రనేతలను కేంద్రం అవమానించిందని కాంగ్రెస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అయితే ఈ హోర్డింగ్ లేనే లేదని బీజేపీ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ మండిపడింది.
ప్రపంచ నేతల ఫోటోలను వారికి ఉన్న ప్రజాదరణను సూచిస్తూ ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా ఆరోపించారు. మోడీ అత్యధిక ప్రజాధరణ కలిగిన నేతగా హోర్డింగ్ లో సూచించినట్టుగా పవన్ ఖేరా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ హోర్డింగ్ ద్వారా ప్రపంచ నేతలను అవమానించారని ఖేరా విమర్శించారు. ఈ విషయమై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కు తన ట్వీట్ ను పవన్ ఖేరా ట్యాగ్ చేశారు.
ఈ ఏడాది ఆరంభంలో మార్నింగ్ కన్సల్ట్ అనే యూఎస్ కు చెందిన సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా తేల్చింది.ప్రపంచంలోని 22 మంది పై సర్వే నిర్వహించగా మోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ రెండో స్థానంలో నిలిచారు. స్వీస్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ మూడో స్థానంలో నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , కెనడాకు చెందిన ట్రూడో 40 శాతం ప్రజల ఆమోదం పొందారు. వీరిద్దరూ ఏడు, తొమ్మిదో స్థానాలు దక్కించుకున్నారు.జీ 20 సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి అగ్ర నేతలు ఈ నెల 8, 9 తేదీల్లో న్యూఢిల్లీకి చేరుకుంటారు.
పవన్ ఖేరా చేసిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు ఇది నిదర్శనమని విజయ్ గోయల్ పేర్కొన్నారు.