చెన్నై: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకె మధ్య సీట్ల ఒప్పందం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ కోసం కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలు ఆదివారం నాడు ఓ కొలిక్కి వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సీట్లను కోరింది. అయితే డీఎంకె మాత్రం కాంగ్రెస్ కోరిన సీట్లను ఇవ్వలేదు. తమిళనాడులో జరిగే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది.  కాంగ్రెస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో డీఎంకె అభ్యర్ధులకు ఆ పార్టీ మద్దతును ఇవ్వనుంది.

రెండు పార్టీల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందంపై తాము సంతకం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు చీఫ్ కెఎస్ అళగిరి ఆదివారంనాడు ప్రకటించారు.

ఫిబ్రవరి 25న తొలివిడత చర్చలు జరిగాయి. శనివారం నాడు మూడో విడత చర్చలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం కాంగ్రెస్, డీఎంకె నేతల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై కాంగ్రెస్ చీఫ్ అళగిరి, డిఎంకె చీఫ్ స్టాలిన్ సంతకాలు చేశారు. 

ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు కన్యాకుమారి ఎంపీ స్థానానికి కూడ ఎన్నికలు జరగనున్నాయి. కన్యాకుమారి ఎంపీ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కరోనాతో ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన ఎంపీ గత ఏడాదిలో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.కన్యాకుమారి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. కన్యాకుమారి ఎంపీ స్థానం నుండి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని ఆ పార్టీ ఎంపీ కార్తీ  చిదంబరం ఎఐసీసీ జాతీయ నాయకత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

ఎఐఏడీఎంకె, బీజేపీలు మరో కూటమిగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. బీజేపీ కోరినన్ని సీట్లను ఇచ్చేందుకు అన్నాడిఎంకె సిద్దంగా లేదని ఆ పార్గీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.