పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మోగా, హోషియార్‌పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్‌కోట్, భటిండా మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకొంది
ఛంఢీఘడ్:పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మోగా, హోషియార్‌పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్‌కోట్, భటిండా మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకొంది.ఇక గత 53 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ కంచుకోటగా ఉన్న భాటిండాలో కాంగ్రెస్ విజయం సాధించింది.ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ట్విటర్‌లో షేర్ చేశారు.
53 ఏళ్ల తర్వాత తొలిసారిగా భాటిండాకు కాంగ్రెస్ మేయర్ రాబోతున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన భాటిండా ప్రజలకు ధన్యవాదాలు. పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 14న 109 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలతో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.
ఇక ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు సుదీర్ఘ కాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ద్వారా కేంద్రంపై తమ అసహనాన్ని ప్రదర్శించేందుకు పంజాబ్ ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో 71.39 పోలింగ్ నమోదైంది.
బీజేపీకి భారీ షాక్
ఇక ఇప్పటికే ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు హస్తం ఖాతాలో పడటంతో బీజేపీకి భారీ షాక్ తగిలినట్లయింది. ఇన్నాళ్లు పార్టీకి బలంగా ఉన్న అర్బన్ ఓటర్ బేస్ ఒక్కసారిగా కోల్పోయినట్లయింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంది.
