Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహులే కావాలి: ఏడు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు తీర్మానం

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కావాలని రాష్ట్ర  యూనిట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు ఈ మేరకు తీర్మానాలు చేశాయి. మరో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ త్వరలోనే ఈ తరహా రిల్యూషన్ తేనున్నట్టు తెలుస్తున్నది.

congress state units resolutes in favour of rahul gandhi taking party chief
Author
First Published Sep 19, 2022, 6:55 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే బాధ్యతలు తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తల డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏకంగా రాష్ట్రాల యూనిట్లే తీర్మానాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ యూనిట్లు ఈ మేరకు తీర్మానాలు చేశాయి. మరో రాష్ట్ర పార్టీ యూనిట్ త్వరలోనే ఇలాంటి తీర్మానం చేయనున్నట్టు తెలుస్తున్నది. 2017లోనూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే రాష్ట్రాల యూనిట్లు తీర్మానాలు చేశాయి.

ఈ సారి ఈ పరంపరను రాజస్తాన్ మొదలు పెట్టింది. రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ఉండాలని తీర్మానించింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల యూనిట్లు కూడా అదే దారి పట్టాయి. సెప్టెంబర్ 18న 310 మంది ఛత్తీస్‌గడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు రాహుల్ గాంధీనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని కోరుతూ ఓ తీర్మానం చేశారు.

గుజరాత్ పార్టీ యూనిట్ కూడా ఇలాంటి డిమాండ్ చేసింది. భారత భవిష్యత్, యువత గళం అయిన గౌరవనీయ రాహుల్ గాంధఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నట్టు పేర్కొంది. 

తమిళనాడు, బిహార్ కాంగ్రెస్ కమిటీలు కూడా జనరల్ కౌన్సిల్ మీటింగుల్లో ఇలాంటి  తీర్మానాలు తెచ్చాయి. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ యూనిట్లు కూడా ఇదే డిమాండ్‌తో తీర్మానం చేశాయి. త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యూనిట్ కూడా రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడిగా మారాలని కోరుతూ ఓ రిజల్యూషన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

అయితే, రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. ఆయన ఈ పోస్టును మళ్లీ వద్దన్నట్టు గతంలో కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి ఏమిటన్నది తెలియదు. అయితే, ఆయన కన్యాకుమారిలో విలేకరులతో మాట్లాడుతూ ఓ హింట్ వదిలారు. తాను కచ్చితంగా నామినేషన్ వేయాల్సి వస్తున్నదని, లేదంటే... పార్టీ నాయకత్వం తీసుకోవడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం ఇవ్వాలనే డిమాండ్ పెట్టారని ఆయన వివరించారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఈ నెల 24వతేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఈ ఎన్నికల బరిలో ఒక్కరే ఉంటే మాత్రం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా నియామకం అవుతాడని తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios