Congress: కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దారుణ ఫలితాలు రాబట్టింది. దీంతో హస్తం పరిస్థితి మున్ముందు మరింతగా దారుణంగా మారుతుందనే విధంగా సంకేతాలు పంపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు రావడంతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కోల్పోయే విధంగా కాంగ్రెస్ పరిస్థితి మారింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శననిచ్చింది. ఏ రాష్ట్రంలోనూ కనీసం రెండు అంకెల స్థానాలను కూడా గెలుచుకోలేకోయింది. 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఘోరంగా కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఉత్తరాఖండ్ లో 19 స్థానాల్లో గెలుపొందింది. అలాగే మణిపూర్ లో 5, గోవాలో 11 స్థానాల్లో గెలిచింది. అయితే పంజాబ్ లో అధికారం కోల్పొయింది. కేవలం 18 స్థానాలకు పరిమితం అయ్యింది.
కాంగ్రెస్ ఘోర పరాజయంతో ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు కాలం ఎదురైంది. పార్లమెంటులోని ఎగువ సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సంవత్సరం ఎగువ సభకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ సంఖ్య చారిత్రాత్మకంగా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదాకు అవసరం అయ్యే కనీస బలానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ ఎన్నికల్లోనూ వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ రాణించలేకపోతే, ఈ సారి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కొల్పోయే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఎగువ సభలో 34 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ ఏడాది ఏడు స్థానాలు కోల్పొయే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఒక పార్టీ ప్రతిపక్ష హోదా నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదాను పొందాలంటే సభ మొత్తం సభ్యత్వంలో కనీసం 10 శాతం బలం కలిగి ఉండాలి. ప్రతిపక్ష నాయకుడి హోదాను నిలుపుకోవడానికి ఒక పార్టీ తన నాయకుడికి కనీసం 25 మంది సభ్యులను కలిగి ఉండాలని రాజ్యసభ అధికారులు తెలిపారు. కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు, ఎందుకంటే సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 10 శాతం కంటే తక్కువగా ఉంది. రాజ్యసభలో 13 ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం ఈ నెల ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చింది.
పంజాబ్ నుంచి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న సభ్యుల్లో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కొత్త పంజాబ్ అసెంబ్లీలో మూడు వంతుల మెజారిటీతో, దాని సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. కాబట్టి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని ఏడు స్థానాల్లో కనీసం ఆరింటిని గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే, ఈ ఏడాది అసోం, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో కూడా కాంగ్రెస్ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారనుందని తెలుస్తోంది.
