పాత వీడియోలతో కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నట్టు తేలింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఓ విద్యార్థి తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోతూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్‌కు తరలించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఆ విద్యార్థి పోస్ట్ చేసిన పాత వీడియోనే మళ్లీ పోస్టు చేసి కేంద్రంపై విమర్శలు చేసింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుగుతున్న ఈ క్లిష్ట సందర్భంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు, భారత విద్యార్థులపై దేశ ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని ఎలాగైనా సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇటు ఉక్రెయిన్‌ను, అటు రష్యాను సహాయం కోరింది. భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి హెల్ప్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏకంగా ‘ఆపరేషన్ గంగ’ అనే పేరుతో తరలింపు మిషన్ చేపట్టింది. వీలైన దారుల్లో ఉద్రిక్త ప్రాంతాల్లో చిక్కుకున్న విద్యార్థులను సరిహద్దు దాటించి రొమేనియా, హంగరీ, పొలాండ్‌లకు పంపుతున్నది. అక్కడి నుంచి భారత విమానాలు వారిని స్వదేశానికి తీసుకువస్తున్నది. ఈ వ్యవహారమంతా కత్తి మీద సాము వంటిదే. ప్రతీది జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిందే. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు భారత విద్యార్థులను అప్రమత్తం చేస్తూనే వచ్చింది. రష్యా సైనిక చర్య ప్రకటించడానికి ముందే భారతీయులను, భారత విద్యార్థులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా సూచనలు చేసింది. తరలింపు ప్రక్రియ సజావుగా
సాగడానికి పర్యవేక్షించడానికి మోడీ ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ క్లిష్ట సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులపైనా కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ బుధవారం మధ్యాహ్నం ఒక వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. అందులో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఓ విద్యార్థి తన గోడు చెప్పుకుంటున్నాడు. ఈ బార్డర్‌లో తాము 10 గంటల నుంచి ఎదురుచూస్తున్నామని, కానీ, తమ కోసం ఏ అధికారి కూడా రాలేడని ఆ విద్యార్థి వీడియోలో వాపోయాడు. నిన్న మధ్యాహ్నం బయల్దేరి ఇక్కడకు వచ్చామని, ఇప్పటి వరకు తమ గురించి ఆరా తీసిన నాథుడే లేడని వివరించాడు. తమ పట్ల ఇంత నిర్లక్ష్యమా అంటూ పేర్కొన్నాడు. దీనికి బదులు చనిపోయింది మేలు అంటూ బాధపడుతూ చెప్పాడు. ఏ మిస్సైల్ వచ్చి తనను ఛిద్రం చేసినా బాగుండూ అంటూ బాధపడ్డాడు. విద్యార్థుల తరలింపు గురించి కేవలం మాటలు మాత్రమే జరుగుతున్నాయని, ఇక్కడ తమ కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారనీ, కానీ, అది అవాస్తవం అని పేర్కొన్నాడు. ఇక్కడ ఎవరూ లేరని, తాము ఇక్కడి నుంచి ఎలా బయటపడగలం అని ప్రశ్నించాడు.
ఈ కన్నీళ్లకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ సమాధానం చెప్పలేదని ఈ వీడియో షేర్ చేస్తూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లో ఈ పిల్లలు ఏడుస్తుంటే వారి మానాన వారినే వదిలిపెట్టిందని ఆరోపించింది. పరిస్థితులు ఇలా ఉంటే పీఎం మోడీ ఎన్నికల్లో గెలవడానికి పూనుకున్నారని పేర్కొంది.
కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు రశీద్ రిజ్వాన్. ఆయనను మోడీ ప్రభుత్వం సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియో చేశాడు. ఓ లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రశీద్ రిజ్వాన్ సురక్షితంగా భారత్ చేరుకున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆయన పాత వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి విషప్రచారం చేస్తున్నదని కొందరు నెటిజన్లు మండిపడ్డారు.
