'నా మృతదేహం కూడా బీజేపీలో చేరదు': సిద్ధరామయ్య
తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు. కర్నాటకలో ఎన్నికల సందర్భంగా ఆయన ఓ ర్యాలీలో సంచలన ప్రకటన చేశారు.

దేశానికి రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రిని చేస్తానని హామీ ఇచ్చినా.. తాను బీజేపీలో చేరబోనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకపడ్డారు. తాను ప్రాణం ఉండగా బీజేపీలో చేరననీ, తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆశగా ఉన్న హెచ్‌డి కుమారస్వామి,జనతాదళ్ సెక్యులర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని కాంగ్రెస్-జెడిఎస్ కూటమి అంతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దిరామయ్య ప్రకటనపై బీజేపీ నేత నారాయణస్వామి స్పందిస్తూ..సిద్ధరామయ్య భ్రమపడుతున్నారని అన్నారు. "ఆయన మృతదేహం ఇక్కడికి ఎందుకు వస్తుంది? అతను భ్రమపడుతున్నాడు. మీరు మాజీ సిఎం. మీపై మా అందరికీ గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడండి" అని బిజెపి ఎమ్మెల్సీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 2023లో లేదా అంతకు ముందు జరుగుతాయని భావిస్తున్నారు.