పొత్తులపై ఇండియా కూటమిలో లుకలుకలు.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్ , ఐదుగురితో కమిటీ ఏర్పాటు
బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పొత్తులపై కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం నేషనల్ అలయన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్, ముకుల్ వాస్నిక్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పొత్తులపై ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం నేషనల్ అలయన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్, ముకుల్ వాస్నిక్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు.
అయితే ఇవాళ ఢిల్లీలో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్, ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) అగ్రనేతల సమావేశానికి ముందు కాంగ్రెస్ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి పొత్తుల అంశం కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పద అంశంగా మారాయి. మధ్యప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్ కమల్‌నాథ్ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో సీట్లు పంచుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోతానని బెదిరించారు. తక్షణం జోక్యం చేసుకున్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆయనతో భేటీ అయి పరిస్ధితిని చక్కదిద్దినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అలాగే ఇండియా కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తును వ్యతిరేకిస్తున్నాయి. అలాగే కేరళలో లెఫ్ట్ ఫ్రంట్‌తో పొత్తు వద్దని అక్కడి నేతలు చెబుతున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు ఇవ్వడంపై ఎస్పీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.