ఒకప్పుడు  కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి నెలలు కావొస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎన్నికకాలేదు.

వయోభారంతో బాధపడుతూనే సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్లు ఆమెకు ఓ లేఖ రాశారు. హైకమాండ్‌తో పాటు అంతర్గత సమస్యలపైనా చర్చించాల్సిందిగా 20 మంది లేఖ రాశారు.

దీనిపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనుంది. వరుసగా రెండోసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అధినేతగా కొనసాగాలని పార్టీ పెద్దలు, శ్రేణులు కోరినా ఆయన మనసు మార్చుకోకపోవడంతో సోనియా గాంధీ గతేడాది ఆగస్ట్ 9న తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం కాలంలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత కోవిడ్ కారణంగా అధ్యక్ష ఎన్నికలో జాప్యం జరిగింది.

మరోవైపు తన ఆరోగ్య పరిస్ధితుల కారణంగా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.