పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టబోతున్నట్టు తెలిసింది. భారత్ జోడోకు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని దానిపై ఫోకస్‌ను అలాగే మెయింటెయిన్ చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తున్నది. జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్లు ఈ సమావేశాలకు హాజరు కాకుండా రాహుల్ గాంధీతోపాటే భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నట్టు విశ్వసనీయవర్గాలు వివరించాయి.
భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమానికి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే ప్రథమం. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రపై ఏర్పడిన ఫోకస్‌ను పక్కదారి పట్టించకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతున్నది. అందుకే సీనియర్ నేతలు శీతాకాల సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ పార్టీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఒక నెల ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్లాన్ వేసుకుంది.
Also Read: ఆ పాలసీపై కాంగ్రెస్ యూటర్న్? ఖర్గేకు పార్లమెంటు పోస్టు ఇస్తారా?.. కీలక నేతలతో సోనియా భేటీ
ఇదిలా ఉండగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత బాధ్యతలపై నిర్ణయం ఈ భేటీలో తీసుకోబోతున్నది. ఈ భేటీ సోనియా గాంధీ సారథ్యంలో జరుగుతున్నది. మల్లికార్జున్ ఖర్గేకే ఈ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. వన్ పర్సన్ వన్ పోస్టు అనే కాంగ్రెస్ పాలసీకి లోబడి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఆ పోస్టుకు మళ్లీ ఆయననే ఎంచుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే కాంగ్రెస్ తీర్మానించుకున్న ఒక వ్యక్తికి ఒక పదవి అనే నిబంధన నుంచి మల్లికార్జున్ ఖర్గేకు మినహాయింపు ఇవ్వనున్నట్టు అర్థం అవుతున్నది.
