కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు పార్టీ అధికారంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతుండటంతో ఆయన అసహానం వ్యక్తం చేశారు.

రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా దూరంగా వెళ్లిపోతున్నారని తమకు అదే పెద్ద సమస్య అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. కొందరు పార్టీ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు లబ్ధిపొందారని.. కాని వారు ప్రస్తుతం పార్టీని వీడి వెళ్లిపోయారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

అధ్యక్ష పదవికి రాజీనామా చేయవద్దని రాహుల్ గాంధీకి ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ఆయన ఎవరి మాటా వినలేదని ఖుర్షీద్ తెలిపారు. రాహుల్ రాజీనామా చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కూడా పార్టీ విశ్లేషించలేకపోయిందని సల్మాన్ అభిప్రాయపడ్డారు.

పార్టీ అగ్రనేత తమను విడిచిపెట్టడమే పెద్ద సమస్యని అన్నారు. ఆయన నిర్ణయం కారణంగా పార్టీలో శూన్యత ఆవరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు కూడా రాహుల్ నిర్ణయాన్నే కోరుకుంటున్నారని ఖుర్షీద్ గుర్తు చేశారు.