కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కాదని, కానీ, పార్టీ కీలక నిర్ణయాలు అన్నీ ఆయనే తీసుకుంటాడని చెప్పారు. మళ్లీ ఆయనే అధ్యక్షుడిగా ఉండాలని డిమాండ్లు రావడం ఏమితో అర్థం కావట్లేదు అని, ఒక రకంగా ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు అని వివరించారు.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అది అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకున్నది. కనీసం ఆప్‌కు గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్ అత్యున్నత బాడీ సీడబ్ల్యూసీ సమావేశమై సుమారు ఐదు గంటలపాటు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలోనే ఎన్నికల్లో పరాజయంపై పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉంటాయని చాలా మంది భావించారు. పార్టీలో సమూల మార్పులతోపాటు నాయకత్వ మార్పు కూడా ఉంటుందని ఆశించారు. కానీ, అవేమీ లేకుండానే సమావేశం ముగిసింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్‌లో మార్పులు జరగాలని బలంగా డిమాండ్ చేస్తున్న 23 నాయకులు మరోసారి కత్తులు నూరుతున్నారు. ఈ 23 మందిలో ఒకరైన కపిల్ సిబల్ తాజాగా, కాంగ్రెస్ నాయకత్వంపై కటువుగా స్పందించారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్.. రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా గాంధీలు తమ పొజిషన్ల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని, అందుకు ఇదే సరైన సమయం అని అన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. గాంధీలు స్వచ్ఛందంగానే ఈ పని చేయాలని, ఎందుకంటే.. ప్రస్తుత పొజిషన్‌లకు నామినేట్ చేసిన కమిటీ.. ఎలా వారిని తొలగిస్తుందని ప్రశ్నించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్నది. దీనిపైనా కపిల్ సిబల్ రియాక్ట్ అయ్యారు.
రాహుల్ గాంధీ.. ఒక రకంగా ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు అని కపిల్ సిబల్ అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు పంజాబ్ వెళ్లారని, అక్కడకు వెళ్లి సీఎం క్యాండిడేట్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ అని ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన ఏ అధికారంతో ఆ నిర్ణయం ప్రకటించారని అడిగారు. ఆయన పార్టీకి అధ్యక్షుడు కాదని, కానీ, పార్టీ నిర్ణయాలు అన్నీ ఆయనే తీసుకుంటారని వివరించారు. ఒక రకంగా ఆయనే ఇప్పుడు అధ్యక్షుడు అని తెలిపారు. అలాంటి సమయంలో వారు ఎందుకు మళ్లీ రాహుల్ గాంధే అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని అడుగుతున్నారు? అంటూ ప్రశ్నించారు.
తనకు ఒక ఇంటికే పరిమితమైన కాంగ్రెస్ వద్దని, అందరి కాంగ్రెస్ కావాలని అన్నారు. తన తుది శ్వాస ఉండే వరకు అందరి కాంగ్రెస్ కోసం పోరాడుతానని తెలిపారు. అందరి కాంగ్రెస్ అంటే.. ఇప్పుడు బీజేపీని వద్దనుకునే ప్రతి ఒక్కరి కాంగ్రెస్ అని వివరించారు. అయితే, కొందరు ఏ, బీ, సీ వంటి పేర్లు చెబుతూ.. వారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేనే లేదని చెబుతుంటారని అన్నారు. ఆ ఇంటి కాంగ్రెస్ లేకుండా అందరి కాంగ్రెస్ మనుగడ సాధించలేదని వారు అభిప్రాయపడుతుంటారని అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
సీడబ్ల్యూసీలో ఉన్నట్టుగానే పార్టీ అంత ఉండదని, సీడబ్ల్యూసీ నిర్ణయమే పార్టీ మొత్తం నిర్ణయం కాదని, సీడబ్ల్యూసీ వెలుపల కూడా కొన్ని కీలక అభిప్రాయాలు వస్తున్నాయని కపిల్ సిబల్ తెలిపారు. వాటిని వినాలనుకుంటే.. తమ అభిప్రాయాలు వినాలని వవరించారు.
పార్టీలో మౌలిక మార్పులను కోరుతూ 2020లో 23 మంది సీనియర్ పార్టీ నేతలు సోనియా గాంధీకి ఓ లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఒకరు.
