కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌కు శ్రీనగర్‌లో చేదు అనుభవం ఎదురైంది. కశ్మీర్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన ఆయనను శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు.

జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్‌తో కలిసి ఆజాద్ ఢిల్లీ నుంచి గురువారం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకుని.. నగరంలోకి అనుమతించమని చెప్పి తిరిగి ఢిల్లీకి పంపించారు.

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన విషయంలో కేంద్రప్రభుత్వం ఏకస్వామ్యంగా వ్యవహరించిందని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. కాగా.. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

నాటి నుంచి కాశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే పలువురు నిరసనకారులు, రాజకీయ పార్టీల నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.