కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి రాజీనామా చేయడంపై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం రాజకీయాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీలో ఉండే వారు ఉండొచ్చని, వెళ్లేవారు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సందర్భంలో మాత్రం కలిసికట్టుగానే పోరాటం చేస్తామని, గెలిచి చూపిస్తామని మాజీ కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

కాగా, పీసీ చాకో బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇదే సమయంలో హైకమాండ్‌పై చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు లేకుండా ఏడాది నుంచి పార్టీ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అసలు నాయకత్వమే లేదని, ప్రజాస్వామ్యమే లేదని చాకో ఆరోపించారు. 

కేరళలో స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన పీసీ చాకో కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

మొదటిసారి పిరవం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈకే నాయనర్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మూడు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన 2జీ స్కాంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు.

2014 ఎన్నికల్లో చిలకుడి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 74 ఏళ్ల పీసీ చాకో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అది కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం విశేషం. ఆయన మరేదైనా పార్టీలో చేరతారా? లేదా అనే విషయంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.