కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ఖాతాలతో 5 వేల మందికి చెందిన ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది.ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఈ బాలిక తల్లిదండ్రులను గుర్తించేలా ట్విట్టర్‌లో ఫోటోలు పోస్టు చేసినందుకుగాను ఈ ఖాతాలను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ప్రకటించింది. అయితే తమ ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ కావడంపై కాంగ్రెస్ మోడీపై విమర్శలు గుప్పించింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలు, ముఖ్యులకు చెందిన ట్విట్టర్ ఖాతాలు గురువారం నాడు బ్లాక్ అయ్యాయి.

గత వారంలో ఢిల్లీలో దళిత సామాజికవర్గానికి చెందిన 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి గురై హత్య చేయబడింది.ఈ విషయం తెలిసిన రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని ఓదార్చాడు. ఈ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ పార్టీ వెల్లడించింది.

మోడీజీ ఎందుకంత భయపడుతున్నారని ఆ పార్టీ ప్రశ్నించింది. సత్యం, అహింస, ప్రజల ఆకాంక్షలను ఆయుధాలు మలుచుకొని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశామని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. భవిష్యత్తులో కూడ ఈ పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పింది.

తన నియమాలను, న్యాయబద్దంగా నిష్పాక్షికంగా ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని ట్విట్టర్ తేల్చి చెప్పింది. తమ నిబంధనలను ఉల్లంఘించే పోస్టులు, చిత్రాలపై చర్యలు తీసుకొంటామని తెలిపింది.

నేషనల్ కమిషనర్ ఫర్ ప్రోటెక్షన్ చైల్డ్ రైట్స్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను ట్విట్టర్ ప్రస్తావించింది. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి తల్లిదండ్రుల గుర్తింపును తెలియజెప్పడం నిబంధనలకు విరుద్దమని ట్విట్టర్ తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాతో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, మాణికం ఠాగూర్, జితేంద్రసింగ్, సున్మితాదేవ్ ట్విట్టర్ ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయి.