Asianet News TeluguAsianet News Telugu

టీకా రాజకీయం: నష్టపోయిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు.. బీజేపీ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ భేష్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో టీకా అందుబాటులోకి వచ్చినప్పుడు దేశంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు టీకా రాజకీయాలు చేశాయి. కానీ, ఇప్పుడు టీకాలు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచుతున్నా.. టీకా పంపిణీ వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా వ్యాక్సినేషన్‌పై అలసత్వం వహిస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో సింగిల్ డోసు 90శాతం, డబుల్ డోసు 50శాతం మందికి అందించలేకపోవడం గమనార్హం.
 

congress ruled states behind in vaccination targets
Author
New Delhi, First Published Nov 29, 2021, 3:43 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన సమయంలో టీకా కోసం కోటి ఆశలతో ప్రపంచదేశాలు ఎదురుచూశాయి. టీకా అభివృద్ధిలో భారత్ కూడా గణనీయమైన కృషి చేసింది. ఫలితంగానే మన దేశంలోనే తయారైన రెండు టీకాలు అందుబాటులోకి రాగలిగాయి. వ్యాక్సిన్ నేషనలిజం కారణంగా టీకా అభివృద్ధి చెందిన వెంటనే చాలా దేశాలకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాలేవు. ఇక్కడ సీరం, భారత్ బయోటెక్ కృషితో స్వదేశీయంగా తయారైన రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తొలుత ఈ టీకాల కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ, ఈ రెండు సంస్థలూ తమ సామర్థ్యాన్ని పెంచుకుని అధిక సంఖ్యలో టీకాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను పట్టించుకోకుండా మనదేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం టీకా రాజకీయాలు చేశాయి. ఈ రాజకీయాలతో ఆ రాష్ట్రాల ప్రజలే నష్టపోతున్నారు. అక్కడ టీకా పంపిణీ మందగించింది.

తమ రాష్ట్రానికి తక్కువ డోసులు పంపిస్తున్నదని, వివక్ష చూపిస్తున్నదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్రాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వ్యాక్సిన్ మైత్రిని కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఇటు టీకా తయారీదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో టీకాలు అవసరమైన మేరకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టీకా పంపిణీ వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. కానీ, కాంగ్రెస్ లేదా దాని మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సినేషన్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. టీకా పంపిణీ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

టీకాలు లేనప్పుడు రాజకీయం చేసిన ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో సింగిల్ డోసు పంపిణీ ఇప్పటికీ 90 శాతం దాటలేదు. రెండో డోసులు కూడా 50 శాతం అర్హులైన వారికీ వేయలేకపోయాయి. ఇదిలా ఉండగా బూస్టర్ డోసు కావాలనే కొత్త పాటను అందుకున్నాయి. కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటికే ఏడు బీజేపీ పాలిత రాష్ట్రాలు సింగిల్ డోసును 90శాతం మంది ప్రజలకు వేశాయి. కాగా, ఎనిమిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండో డోసు పంపిణీ 50శాతం మంది అర్హులకు పూర్తయ్యాయి.

కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్‌లో సింగిల్ డోసు 66.2శాతం పూర్తవ్వగా 30.8శాతం మందికి సెకండ్ డోసు పంపిణీ పూర్తయింది. పంజాబ్‌లో 72.5శాతం మందికి సింగిల్ డోసు, 32.8 శాతం మందికి డబుల్ డోసులు పూర్తయ్యాయి. తమిళనాడులో 78.1శాతం సింగిల్ డోసు, 42.65శాతం మందికి సెకండ్ డోసులు వేయడం పూర్తయింది. మహారాష్ట్రంలో సింగిల్ డోసు 80.11శాతం, డబుల్ డోసు 42.5శాతం, ఛత్తీస్‌గడ్‌లో తొలి డోసు 83.2శాతం, రెండో డోసు 47.2శాతం, రాజస్తాన్‌లో తొలి డోసు 84.2శాతం, రెండో డోసు 46.9శాతం, పశ్చిమ బెంగాల్‌లో తొలి డోసు 86.6 శాతం, రెండో డోసు 39.4శాతం మందికి పంపిణీ పూర్తయింది. 

కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే ఇక్కడ టీకా పంపిణీ వేగంగా జరుగుతున్నట్టు అర్థమవుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో సింగిల్ డోసు 100శాతం పూర్తవ్వగా రెండో డోసు పంపిణీ 91.9శాతం పూర్తయింది. గోవాలో సింగిల్ డోసు 100 శాతం, రెండో డోసు 87.9శాతం మందికి పంపిణీ సమాప్తమయింది. గుజరాత్‌లో తొలి డోసు 93.5శాతం మందికి, మలి డోసు 70.3శాతం, ఉత్తరాఖండ్‌లో ఫస్ట్ డోసు 93.0శాతం, సెకండ్ డోసు 61.7శాతం, మధ్యప్రదేశ్‌లో తొలి డోసు 92.8శాతం, రెండో డోసు 62.9శాతం మందికి పంపిణీ చేయడం పూర్తయింది. కర్ణాటకలో ఫస్ట్ డోసు 90.9శాతం, సెకండ్ డోసు 59.1శాతం, హర్యానాలో తొలి డోసు 90.04శాతం, మలి డోసు 48.3శాతం మందికి, అసోంలో ఫస్ట్ డోసు 88.9శాతం మందికి, సెకండ్ డోసు 50శాతం మందికి, త్రిపురలో తొలి డోసు 80.5శాతం మందికి, రెండో డోసు 63.5శాతం మందికి పంపిణీ పూర్తయింది.

Follow Us:
Download App:
  • android
  • ios