బిహార్‌లో ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్‌ ఈ నెల 28న జరగనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. దీనిలో భాగంగా ప్రచారానికి 30 స్టార్ ప్రచారకుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ మేరకు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు రాహుల్‌ గాంధీ, మీరా కుమార్‌, గులాం నబీ ఆజాద్‌, ప్రియాంక గాంధీ, మదన్‌ మోహన్‌ ఝా, అశోక్‌ గహ్లోత్‌, అమరీందర్‌సింగ్‌, భూపేష్‌ బాఘేల్‌, సచిన్‌ పైలట్‌, కీర్తి ఆజాద్‌, సంజయ్‌ నిరుపమ్‌ సహా మొత్తం 30మంది బిహార్‌ తొలి విడత ఎన్నికలకు ప్రచారం చేయనున్నారు.  

బీహార్‌లో ఇప్పటి వరకు అధికార జేడీ(యూ)-బీజేపీతో కూడిన ఎన్డీయే, ఆర్జేడీ-కాంగ్రెస్ తదితర పార్టీల‌కు చెందిన మహాకూటమి ఉండగా తాజాగా ఆర్ఎల్ఎస్పీ, ఏఐఎంఐఎం మరో నాలుగు పార్టీలతో మూడో కూటమిని ఏర్పాటు చేసింది.

మరోవైపు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్డీయే కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో (అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో) జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 10న ఓట్లలెక్కింపు జరగనుంది.