Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. ఎలాంటి హామీలు ఇచ్చిందంటే ?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు మేనిఫెస్టో పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తన మేనిఫెస్టో ను విడుదల చేసింది.

Congress released the election manifesto.. What kind of assurances did it give?..ISR
Author
First Published Apr 5, 2024, 1:12 PM IST

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో మహిళలకు నగదు బదిలీ, ఉపాధి అవకాశాలు, కుల గణనపై పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 'పాంచ్ న్యాయ్' లేదా ఐదు మూలస్తంభాల్లో 'యువ న్యాయ్', 'నారీ న్యాయ్', 'కిసాన్ న్యాయ్', 'శ్రామిక్ న్యాయ్', 'హిస్సేదారీ న్యాయ్' ఉన్నాయి.

మేనిఫెస్టోలో ముఖ్య హామీలు ఏమిటంటే ? 
కులాలు, ఉపకులాలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను లెక్కించడానికి దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక కుల గణనను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ డేటా ఆధారంగా సానుకూల కార్యాచరణ ఎజెండాను బలోపేతం చేస్తామని ఆ పార్టీ తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణను ఆమోదిస్తామని పార్టీ హామీ ఇచ్చింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వివక్ష లేకుండా అన్ని కులాలు, వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది. 

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేయబడిన పోస్టులలో అన్ని బ్యాక్లాగ్ ఖాళీలను పార్టీ ఏడాది వ్యవధిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగాల కాంట్రాక్టును రద్దు చేసి, ఆ నియామకాల క్రమబద్ధీకరణ జరిగేలా చూస్తామని తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు గృహనిర్మాణం, వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఆస్తుల కొనుగోలు చేసేందుకు సంస్థాగత పరపతిని పెంచుతామని పేర్కొంది.

ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములు, మిగులు భూములను పేదలకు పంపిణీ చేసేలా పర్యవేక్షించేందుకు ఒక అథారిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 

షెడ్యూల్డ్ కులాలకు చెందిన కాంట్రాక్టర్లకు మరిన్ని పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు ఇచ్చేందుకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ పరిధిని విస్తరిస్తామని తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం నిధులను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. 

పేదల కోసం, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలల నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తుంది. వాటిని ప్రతి బ్లాక్ కు విస్తరిస్తామని పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15, 16, 25, 26, 28, 29, 30 ప్రకారం మత మైనారిటీలకు కల్పించిన హక్కులను, విశ్వాసాన్ని ఆచరించే ప్రాథమిక హక్కును పార్టీ గౌరవిస్తుంది. రాజ్యాంగంలోని 15, 16, 29, 30 అధికరణల ద్వారా హామీ ఇచ్చిన భాషా మైనారిటీల హక్కులను కూడా ఇది గౌరవిస్తుందని తెలిపింది. 

మైనార్టీలకు చెందిన విద్యార్థులు, యువత విద్య, ఉపాధి, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు, ఇతర రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా పార్టీ ప్రోత్సహిస్తామని పేర్కొంది.

విదేశాల్లో చదువుకునేందుకు మౌలానా ఆజాద్ స్కాలర్ షిప్ లను పునరుద్ధరిస్తామని, స్కాలర్ షిప్ ల సంఖ్యను పెంచుతామని తెలిపింది. 
మైనారిటీలకు బ్యాంకులు వివక్ష లేకుండా సంస్థాగత రుణాలు అందించేలా చూస్తామని చెప్పింది. విద్య, వైద్యం, పబ్లిక్ ఎంప్లాయిమెంట్, పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్స్, స్కిల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో మైనారిటీలకు ఎలాంటి వివక్ష లేకుండా సముచిత అవకాశాలు లభించేలా చూస్తామని హామీ ఇచ్చింది.

మైనారిటీలకు దుస్తులు, ఆహారం, భాష, వ్యక్తిగత చట్టాల ఎంపిక స్వేచ్ఛ ఉండేలా చూస్తామని తెలిపింది. వ్యక్తిగత చట్టాల సంస్కరణను పార్టీ ప్రోత్సహిస్తుందని తెలిపింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో మరిన్ని భాషలను చేర్చాలనే దీర్ఘకాలిక డిమాండ్లను పార్టీ నెరవేరుస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios