Asianet News TeluguAsianet News Telugu

తీరు మారని కాంగ్రెస్.. ‘సాగు చట్టాల రద్దు’ ప్రకటించినా.. పార్లమెంటు ఆవరణలో నిరసన.. నెటిజన్ల విమర్శలు

కాంగ్రెస్ తీరుపై సోషల్ మీడియాలో నిరసనలు వస్తున్నాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించినా.. అఖిలపక్ష సమావేశంలోనూ దీనిపై స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ధర్నాకు దిగింది. దీనిపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. కాగా, ఇదే రోజు ఉభయ సభలు మూడు సాగు చట్టాల రద్దు బిల్లును ఆమోదించింది.
 

congress protest to repeal farm law despite centre announcement
Author
New Delhi, First Published Nov 29, 2021, 3:01 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంటు(Parliament) శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు(Farm Laws Repeal) చేసే బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నిన్న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ కేంద్ర మంత్రులు స్పష్టంగా చెప్పారు. తొలి రోజే ఉభయ సభల్లోనూ సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెడతామని వివరించారు. ఇందుకోసం పార్టీ ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరుకావాలని బీజేపీ విప్ కూడా జారీ చేసింది. ఇవన్నీ తెలిసీ కూడా కాంగ్రెస్ ఈ రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలో సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ Protest చేసింది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. పార్లమెంటు సమావేశాల తొలి రోజే Congress పార్టీ ఊహించని విధంగా విమర్శలపాలైంది.

ఈ రోజు ఉదయం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేశారు. సాగు చట్టాలు రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపే ఓ పెద్ద బ్యానర్‌ను ముందు పట్టుకుని నిరసన చేశారు. సాగు చట్టాలపైనే వారు నినాదాలు చేశారు. ఇప్పటికే సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ అదే డిమాండ్‌తో ధర్నా చేయడం వ్యతిరేకతను తెచ్చింది.

Also Read: నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు: ఆమోదం తెలిపిన రాజ్యసభ

ఈ నెల మొదట్లోనే జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రైతులకు క్షమాపణలు తెలియజేస్తూ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత మంది రైతులను తాము కన్విన్స్ చేయడంలో విఫలమయ్యామని, కాబట్టి, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనపై రైతులు, రాహుల్ గాంధీ సహా అన్ని పార్టీల నేతలు స్పందించారు. శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాల రద్దు బిల్లు సహా 26 బిల్లులు.. పాస్ చేయాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మళ్లీ ఎప్పటిలాగే, కాంగ్రెస్ పాత దారినే ఎంచుకుని విమర్శలను కొనితెచ్చుకుంది. తాజాగా, పార్లమెంటు అంటే ఆందోళనలే అన్నట్టుగా కాంగ్రెస్ కాలం చెల్లిన డిమాండ్‌తో ధర్నాకు దిగింది.

Also Read: Farm Laws Repeal Bill: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాంగ్రెస్ లీడర్ల ధర్నాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై నెటిజన్లు విమర్శలు చేశారు. సాగు చట్టాల రద్దు నిర్ణయంతో కాంగ్రెస్ కలత చెందుతున్నదా? అంటూ కొందరు ట్వీట్లు చేశారు. సోనియా గాంధీ వివేకమైన నేత అని తాను నమ్ముతానని, కానీ, క్రియాశీల రాజకీయాల్లో ఉండటం చేత రాహుల్ గాంధీకి ఎక్కువ సమాచారం అందుతుందని భావిస్తానని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అయితే, సాగు చట్టాలను రద్దు చేస్తామన్న ప్రకటనను సోనియా గాంధీకి రాహుల్ గాంధీ చెప్పడం మరిచిపోయాడా? అంటూ చురకలు అంటించారు.

ఈ రోజు ప్రారంభమైన సమావేశాల్లో ఎలాంటి చర్చ లేకుండానే మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును ఉభయ సభలు పాస్ చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios