పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం అప్పట్లో సంచనలం కలిగించింది. మోడీపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనకే హగ్ ఇచ్చాడంటూ రాహుల్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వచ్చాయి.

చాలా రోజుల తర్వాత ఇందుకు గల కారణాలను వివరించారు రాహుల్. శనివారం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్ధులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ తన నానమ్మ, తండ్రి కూడా ఉగ్రవాదానికి బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉగ్రదాడుల కారణంగా తాను ఇద్దరు కుటుంబసభ్యులను పొగొట్టుకున్నానని.. ఆందోళనలు ఎంతమాత్రం పని చేయవని తాను భావిస్తానన్నారు. ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయించగలదని అభిప్రాయపడ్డారు.

అనంతరం పార్లమెంటులో మోడీని కౌగిలించుకోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ఆయన జీవితంలో ప్రేమ లేదని నాకు అనిపించిందని... అలాగే తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల ప్రేమ వ్యక్తపరచాలనే ఉద్దేశ్యంతోనే తాను అలా చేసినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

పార్లమెంటులో మోడీని తాను కౌగిలించుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతారని తనకు తెలుసునని, అసలేం జరుగుతుందో ఆయనకు అర్ధమై ఉండదని అభిప్రాయపడ్డారు.

గతేడాది లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన అనంతరం రాహుల్..ప్రధానిని కౌగిలించుకుని.. పక్కనే ఉన్న తన పార్టీకి చెందిన జ్యోతిరాధిత్య సింధియాతో మాట్లాడుతూ కన్నుకొట్టారు.