కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన ప్రవర్తనతో వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా తాను మాత్రం ఫోన్‌లో తలమునకలయ్యారు.

దాదాపు గంటసేపు రాష్ట్రపతి ప్రసంగించగా... ఇందులో సుమారు 24 నిమిషాల పాటు రాహుల్ ఫోన్‌లో బ్రౌజ్ చేస్తూ కనిపించారు. అయితే ఆయన పక్కనే ఉన్న సోనియా గాంధీ మాత్రం రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

ముఖ్యంగా ఉరీ, బాలాకోట్ దాడుల గురించి కోవింద్ మాట్లాడుతున్నాప్పుడు సోనియా గాంధీ ప్రశంసించగా, రాహుల్ మాత్రం పార్లమెంటును ఫోటోలు తీయడం, సోనియాతో మాట్లాడటం చేశారు.

మధ్య మధ్యలో సోనియా గాంధీ ఆయన వైపు చూసినప్పటికీ రాహుల్ ఎప్పటిలానే తన పనిలో తాను మునిగిపోయారు. గతంలో సభలో నిద్రపోవడం, మోడీకి హగ్ ఇవ్వడం, కన్నుగీటడం వంటి చర్యలతో ఆయన తీవ్ర విమర్శల పాలయ్యారు.