Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్యక్షుడు?.. బరిలో శశిథరూర్ వర్సెస్ అశోక్ గెహ్లాట్

కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతరుడు అధ్యక్షుడు కాబోతున్నారా? సోమవారం నాటి పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తున్నది. అధ్యక్ష ఎన్నికలో అభ్యర్థిగా శశిథరూర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆయనకు ప్రత్యర్థిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఈ సారి అధ్యక్ష ఎన్నికల శశిథరూర్ వర్సెస్ అశోక్ గెహ్లాట్‌గా జరుగబోతున్నట్టు తెలుస్తున్నది.
 

congress president election becoming interesting.. as non gandhi candidates emerged as shashi tharoor vs ashok gehlot ready to contest
Author
First Published Sep 20, 2022, 12:48 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉన్నది. ఎన్నికా? ఎంపికా? అనే సంశయం చాలా మందిలో ఉండేది. కానీ, ఈ సారి దీనిపై కొంత స్పష్టత, ఇంకొంత పారదర్శకత కనిపించే అవకాశాలు ఉన్నాయి. కనీసం 20 ఏళ్లకు పైగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ చేతుల్లోనే పార్టీ నడిచింది. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికలో గాంధీయేతరులు పోటీ చేయడం ఆసక్తికరంగా మారుతున్నది. తిరువనంతపురం ఎంపీ, సీనియర్ పార్టీ లీడర్, కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసిన 23 మంది రెబల్ నేతల్లో ఒకరైనా శశిథరూర్, రాజస్తాన్ సీఎం, సీనియర్ లీడర్, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు అశోక్ గెహ్లాట్‌లు పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. సీఎం సీటు వదులుకోవడంపై అశోక్ గెహ్లాట్ కొంత మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ పోటీ వీరి ఇద్దరి మధ్య ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తున్నది.

మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే వచ్చిన శశిథరూర్ సోమవారం మధ్యాహ్నం సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. అక్టోబర్ 17న జరగనున్న అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి రూట్ క్లియర్ చేసుకున్నారు. అదే విధంగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా మరో అభ్యర్థిగా తేలడంతో పార్టీ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారింది. రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కావాలని డిమాండ్ చేస్తున్నవారు.. పార్టీ యథాతథంగా ఉండాలని కోరుకునే వారి మద్దతు అశోక్ గెహ్లాట్‌కు లభించే అవకాశాలు ఉన్నాయి. అశోక్ గెహ్లాట్ స్వయంగా రాహుల్ గాంధీనే ప్రెసిడెంట్ కావాలని పలుమార్లు కోరారు. రాజస్తాన్ కాంగ్రెస్ యూనిట్ కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.

మరో మూడు రోజుల్లో పార్టీ ప్రెసిడెంట్ కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరుణంలో ఈ ఎన్నిక జరుగుతున్నది.

ఈ ఎన్నికపై పార్టీ ఎంపీ, కమ్యూనికేషన్ ఇంచార్జీ జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఈ ఎన్నికలో పోటీ చేయాలని భావించే వారు స్వేచ్ఛగా చేయవచ్చని, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైఖరి మొదటి నుంచీ ఇదేనని ఆయన అన్నారు. ఇది బహిరంగ ప్రజాస్వామిక, పారదర్శక ప్రక్రియ అని వివరించారు. ఇందులో పోటీ చేయడానికి ఎవరికీ ఎలాంటీ అనుమతి అక్కర్లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా పట్టు కోల్పోతూనే ఉన్నది. దినదినం దిగజారిపోతూనే ఉన్నది. ఈ కారణంగానే చాలా మంది సీనియర్ నేతలు పార్టీలో సమూళ ప్రక్షాళన చేయాలని, నాయకత్వ ఎన్నిక మొదలు.. అన్నింటిలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని కోరారు. 23 మంది సీనియర్ నేతలు ఇలాంటి డిమాండ్లతో ఏకంగా అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 2014 సార్వత్రిక ఎన్నికలు మొదలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇంకా కుదుటపడలేదు. రెండు సార్లు జనరల్ ఎన్నికల్లో ఓడిపోయి ఒకదాని వెనుక మరొక రాష్ట్రాన్ని కోల్పోతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష ఎన్నికపై ఆసక్తి ఏర్పడింది.

అధ్యక్షుడిగా తిరిగి రాహుల్ గాంధీనే పగ్గాలు పట్టాలని చాలా మంది పార్టీ నేతలు కోరారు. కనీసం ఏడు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు కూడా చేశాయి. భారత్ జోడో యాత్రను రాహుల్ చేపట్టడం కూడా ఆయనను మళ్లీ బలమైన నేతగా ప్రొజెక్ట్ చేయడానికి లేదా లాంచ్ చేయడానికేనని కొన్ని వాదనలు వచ్చాయి. ఎన్నిక జరిగినా జరగకపోయినా.. గాంధీలను ఇంచార్జీగా పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చలు వినిపిస్తున్నాయి.

చివరి సారి గాంధీయేతర అధ్యక్షుడిగా సీతారాం కేసరి ఉన్నారు. ఆయన నుంచే 1998లో సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. నర్సింహా రావు ప్రభుత్వాన్ని ప్రజలు దించేసిన రెండేళ్ల తర్వాత పార్టీ క్షీణించిన దశలో సోనియా గాంధీ పగ్గాలు తీసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్యతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios