Asianet News TeluguAsianet News Telugu

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే.. హిమాచల్ ప్రదేశ్‌లో ‘నువ్వానేనా’

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనపై అంచనాలపై ఆసక్తి నెలకొంది. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రదర్శన నిస్సారంగా మారినట్టు, హిమాచల్ ప్రదేశ్‌లో నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ పోటీ ఇచ్చినట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.
 

congress performance in gujarat and himachal pradesh assembly elections according to various exit polls
Author
First Published Dec 5, 2022, 8:35 PM IST

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలు ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీల ప్రదర్శనలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. గుజరాత్‌పై బీజేపీ పట్టునిలుపుకుంటుందని, నిలుపుకోవడమే కాదు.. ఈ సారి సీట్లనూ పెంచుకుంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచాన వేశాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్ పార్టీకీ మంచి సీట్ల సంఖ్యనే అంచనా వేశాయి.

గుజరాత్‌లో 27 ఏళ్లుగా అప్రతిహతంగా అధికారాన్ని చేపడుతున్న బీజేపీ వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈసారి కూడా సొమ్ము చేసుకోవడంలో విఫలమైందని ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2017లో పొందిన సీట్లనూ ఈ సారి గెలుచుకోవడం లేదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను గెలుచుకుంది. అంతకుముందు కాంగ్రెస్‌కు 61 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఈ సంఖ్య మరింత తగ్గిపోతున్నది. 

గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీ మార్క్ 92. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ 110కి మించి సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కాగా, కాంగ్రెస్ మాత్రం సీట్లను మరింత నష్టపోతుందని తెలిపాయి. ఆజ్ తక్, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీ 16 నుంచి 30 సీట్లు, ఏబీపీ, సీవోటర్ ఎగ్జిట్ పోల్ 31 నుంచి 43 సీట్లు, న్యూస్ ఎక్స్, జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ 34 నుంచి 51 సీట్లు, రిపబ్లిక్ టీవీ, పీమార్క్ ఎగ్జిట్ పోల్ 30 నుంచి 42 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని వివరించాయి.

ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మారుస్తాయన్న పేరున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ సంప్రదాయానికి విరుద్ధమైన చిత్రాన్ని ముందుంచాయి. 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా వరకు పోటాపోటీగా ప్రదర్శన ఇచ్చినట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

కొన్ని బీజేపీకి స్పష్టమైన మెజార్టీ చూపిస్తుండగా మరికొన్ని కాంగ్రెస్‌కు చూపించాయి. ఆజ్ తక్ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 24 నుంచి 34 సీట్లు, కాంగ్రెస్‌కు 30 నుంచి 40 సీట్లు గెలుస్తాయి. బీజేపీ 35 నుంచి 40 సీట్లు, కాంగ్రెస్ 26 నుంచి 31 సీట్లను గెలుచుకుంటాయని ఇండియా టీవీ మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. కాగా, న్యూస్ 24, టుడేస్ చాణక్య మాత్రం ఈ రెండు పార్టీలు సమానంగా 33 చొప్పున సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. న్యూస్ ఎక్స్, జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ 32 నుంచి 40 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 27 నుంచి 34 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని పేర్కొన్నాయి.

ఇవన్నీ కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. డిసెంబర్ 8వ తేదీన వాస్తవ ఫలితాలు వెల్లడి అవుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios