Congress: కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్ .. ఖాతాలపై ‘‘ ఫ్రీజ్ ’’ ఎత్తేసిన ఐటీ ట్రిబ్యునల్
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంక్ ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసింది. అయితే ఢిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్‌లో అప్పీల్ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం లభించింది. వచ్చే బుధవారం (ఫిబ్రవరి 21) వరకు కాంగ్రెస్ ఖాతాలపై ఉన్న ఫ్రీజ్‌ను ఐటీ ట్రిబ్యునల్ ఎత్తివేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంక్ ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే స్వయంగా వెల్లడించారు. అయితే ఢిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్‌లో అప్పీల్ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం లభించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని గురువారం సుప్రీంకోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడం కలకలం రేపుతోంది.
అయితే ఈ కేసులో నేటి విచారణ తర్వాత.. ఆదాయపు పన్ను శాఖ తన ఖాతాలను అన్‌లాక్ చేసిందని.. అయితే ఖాతా ఐటీ శాఖ విచారణకు లోబడి ఉంటుందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేక్ తంఖా అన్నారు. వచ్చే బుధవారం (ఫిబ్రవరి 21) వరకు కాంగ్రెస్ ఖాతాలపై ఉన్న ఫ్రీజ్‌ను ఐటీ ట్రిబ్యునల్ ఎత్తివేసింది. కోర్టు తన వాదనలను పరిగణనలోనికి తీసుకుందని వివేక్ తంఖా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని.. దాని వల్ల మమ్మల్ని అన్యాయంగా శిక్షించలేమని తాను వారికి చెప్పానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌పై రూ.15 కోట్ల పన్ను ఎలా వస్తుందో తాను కోర్టులో వాదించానని తంఖా అన్నారు.
2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను కాంగ్రెస్ రూ.135 కోట్ల బకాయి వుంది. ఇందులో రూ.103 కోట్ల అంచనా, వడ్డీ రూ.32 కోట్లు (సుమారు) . ఆదాయపుపన్ను చట్టం 1961 లోని U/S కింద 143(3) అసెస్‌మెంట్ 06/07/21న పూర్తి చేయబడింది. సెక్షన్ 13A (D) నిబంధనలను పాటించకపోవడం, రిటర్న్‌లను దాఖలు చేయకపోవడం వల్ల కాంగ్రెస్‌కు మినహాయింపు లభించలేదు. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పడంలో కూడా జాప్యం జరిగింది. 199 కోట్ల ఆదాయం అంచనా వేయగా.. దీని ప్రకారం రూ.105 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు.
దీని తరువాత, AO ముందు వాయిదా ప్రక్రియలో.. ప్రస్తుత విధానం ప్రకారం మొత్తం డిమాండ్‌లో 20% (అంటే సుమారు రూ. 21 కోట్లు) ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరింది. కానీ ఆ పార్టీ రూ.78 లక్షలు మాత్రమే చెల్లించింది. కాంగ్రెస్ డిమాండ్‌లో 20% చెల్లించలేకపోయింది. అందువల్ల మిగిలిన రూ.104 కోట్లు చెల్లించాలని పార్టీకి లేఖ జారీ చేసింది. CIT(A) ముందు కాంగ్రెస్ దాఖలు చేసిన అప్పీలు తరువాత కొట్టివేయబడింది. మే 2023లో ITAT ముందు కాంగ్రెస్ రెండవసారి అప్పీల్‌ను దాఖలు చేసింది. అయితే డిమాండ్‌పై స్టే కోసం ఎటువంటి పిటిషన్‌ను ITAT లేదా మరే ఇతర న్యాయ అధికార సంస్ధ ముందు దాఖలు చేయలేదు. దీని తర్వాత.. 2023 అక్టోబర్‌లో కాంగ్రెస్ రూ. 1.72 కోట్లు చెల్లించింది. కాంగ్రెస్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం ద్వారా రూ.115 కోట్ల రికవరీ జరిగింది.
16/02/24న ఐటీఏటీ ముందు విచారణలో ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేయడం ద్వారా రికవరీ చేయడం సాధారణ రికవరీగా ఆదాయపు పన్ను శాఖ ద్వారా తెలియజేయబడింది. కాంగ్రెస్ తన కార్యకలాపాల కోసం అనేక ఖాతాలను కలిగి వుంది. ఈ వాస్తవాన్ని ఐటీఏటీ గమనించింది. దీనికి సంబంధించిన తాజా విచారణ ఫిబ్రవరి 21, 2024కి షెడ్యూల్ చేయబడింది. అంతకుముందు కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం వెల్లడించారు. దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రూ.210 కోట్ల పన్ను చెల్లించలేదని ఆదాయపుపన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది మూమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య అని అజయ్ మాకెన్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కొన్ని వారాల క్రితం స్తంభించాయని, కనీసం కరెంటు బిల్లు కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని అజయ్ మాకెన్ అన్నారు. మేము ఇచ్చిన చెక్కులను బ్యాంకులు హానర్ చేయడం లేదని మాకు సమాచారం అందిందని. తదుపరి విచారణలో యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు కూడా స్తంభించినట్లు తెలిసిందని, మా ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బు కూడా స్తంభించిపోయిందని అజయ్ మాకెన్ పేర్కొన్నారు.