Asianet News TeluguAsianet News Telugu

‘టైం వచ్చినప్పుడు అన్ని చెబుతా.. ప్రస్తుతం సరదాగా ఉండండి’.. కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న హరీష్ రావత్ కామెంట్స్

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కాంగ్రెస్ ట్రబర్‌ షూటర్‌గా ఉన్న హరీశ్ రావత్‌ (Harish Rawat) వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతున్నాయి. 

Congress new worry in Uttarakhand Harish Rawat flashed more troubling signals
Author
New Delhi, First Published Dec 23, 2021, 1:05 PM IST

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కాంగ్రెస్ ట్రబర్‌ షూటర్‌గా ఉన్న హరీశ్ రావత్‌ (Harish Rawat) వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించాల్సిన హరీశ్ రావత్ చేస్తున్న కామెంట్స్‌ కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా  మారాయి. పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించిన ట్వీట్స్ చేసిన హరీష్ రావత్.. వాటికి ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. తాజాగా సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని విలేకరులతో వ్యాఖ్యానించడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. 

అసలేం జరిగింది..
బుధవారం రోజున హరీష్ రావత్ తాను పార్టీలో ఒంటరని అయిపోయాననే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.  ‘ఎన్నికల సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లాల్సి ఉంది. నేను ఈదుతున్నప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం నాకు పలు చోట్ల సహకరించాల్సింది పోయి ముఖం తిప్పుకుంటున్నారు. నేను ఎవరి ఆజ్ఞతో నేను ఈత కొట్టడానికి దిగానో వారి అనుయాయులే నా కాళ్లు, చేతులు కట్టేస్తున్నారు. నాపైకి మొసళ్లను వదులుతున్నారు. చాలాకాలం నుంచి ఈత కొడుతున్నావు.. ఇదంతా చూస్తుంటే ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని నా అంతరాత్మ చెబుతోంది. నేను సందిగ్ధ స్థితిలో ఉన్నాను. కొత్త సంవత్సరం నాకు ఒక దారి చూపిస్తుందేమో. ఆ కేదారేశ్వరుడే ఒక మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసం ఉంది’ అని పేర్కొన్నారు.

తాజాగా హరీష్ రావత్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన వాటిపై వివరణ ఇవ్వలేదు. ‘సమయం వచ్చినప్పుడు, నేను మీతో ప్రతిదీ పంచుకుంటాను. నేను మీతో మాట్లాడకపోతే.. నేను ఎవరితో మాట్లాడతాను? నేను మీకు ఫోన్ చేస్తాను. ప్రస్తుతానికి, సరదాగా ఉండండి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆయన రాజకీయాల నుంచి  వైదొలుగుతారా అనే అంశం‌పై కూడా తీవ్ర చర్చ సాగుతుంది. 

అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం..
తాజా పరిణామాలతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం.. శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా హరీష్‌ రావత్‌ను కోరింది. ఆయనతో పాటుగా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పక్ష నేత ప్రీతమ్ సింగ్‌ను (Pritam Singh) రేపు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ ఇరువురు నేతలు శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీతో (Rahul Gandhi) సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇక, ఉత్తరాఖండ్‌లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఈ పరిస్థితులు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం దీనిని ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios