కర్ణాటక నూతన సీఎంగా సిద్దరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. దీంతో గత నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
కర్ణాటక నూతన సీఎంగా సిద్దరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. దీంతో గత నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టుగా చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు డీకే శివకుమార్ కేపీసీసీ చీఫ్ ఉంటారని తెలిపారు.
ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయడంలో జరిగిన జాప్యానికి.. విస్తృతమైన చర్చలు కారణమని పేర్కొన్నారు. డీకే శివకుమార్, సిద్దరామయ్యలు ఇద్దరూ అగ్రశ్రేణి సీనియర్ నాయకులని.. ప్రతి ఒక్కరూ ‘‘ముఖ్యమంత్రి కావడానికి అర్హులు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ అధిష్టానం సీఎంగా సిద్దరామయ్యను నిర్ణయించిందని చెప్పారు.
అదే సమయంలో పవర్ షేరింగ్ (అధికార పంపిణీ) గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘‘పవర్ షేరింగ్ అంటే కర్ణాటక ప్రజలతో పవర్‌ను షేర్ చేసుకోవడం... అంతే’’ అని ఆయన సమాధానమిచ్చారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడగా.. సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి విస్తృత చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పవర్ షేరింగ్(చెరో రెండున్నర సంవత్సరాలు సీఎంగా) ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం తీసుకొచ్చిందనే ప్రచారం కూడా సాగింది.
ఇక, సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యను, ఉప ముఖ్యమంత్రిగా శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్.. చివరకు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడం వెనక పెద్ద తతంగమే జరిగింది.
సంస్థాగతంగా పార్టీ కోసం డీకే శివకుమార్ కష్టపడ్డారు. పార్టీ కష్ట సమయాల్లో ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు.. ట్రబుల్ షూటర్ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018ల ఎన్నికల తర్వాత ఏర్పడిన జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికే కూలిపోవడంతో.. గత నాలుగేళ్లుగా తాను పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డాననేది ఆయన అధిష్టానాకికి వివరించారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం పదవి కోసం పట్టుబట్టారు. అదే సమయంలో పార్టీ తనకు తల్లి లాంటిందని.. వెన్నుపోటు పోడవనని, బ్లాక్‌మెయిల్ చేయనని చెప్పుకొచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అంతా తానై నడిపించానని తెలిపారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకను అందించానని చెప్పారు. తాను జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ వచ్చి పరామర్శించారని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
అయితే కర్ణాటక సీఎల్పీలో అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావించింది. సిద్ధరామయ్య మాస్ అప్పీల్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉండటం.. అంతేకాకుండా 2013 నుంచి 2018 వరకు సీఎంగా పనిచేసిన అనుభవం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన వైపే మొగ్గుచూపినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ ముందు పలు ఎంపికలను ఉంచినట్టుగా సమాచారం.
అయితే చివరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యంతో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించడానికి అంగీకరించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి పదవిపై బలమైన డిమాండ్‌తో ఉన్న శివకుమార్‌తో బుధవారం సాయంత్రం సోనియా గాంధీ మాట్లాడిన తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మే 20వ తేదీన బెంగళూరులో కర్ణాటక నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
